జర్మనీకి బిగ్ జలక్.. మళ్లీ ఫుట్ బాల్ ప్రపంచ కప్ తొలి రౌండ్ లోనే ఔట్

Update: 2022-12-02 11:49 GMT
అయ్యో జర్మనీ.. ఎంత పనైంది..? మళ్లీ నిరాశే.. ప్రపంచ చాంపియన్ గా అడుగిడి 2018 ప్రపంచ కప్ లో తొలి రౌండ్ లోనే వెనుదిరిగి దేశ ప్రజలను హతాశులను చేసినట్లే.. 2022లోనూ ఫేవరెట్ గా మొదలుపెట్టి మొదటి మెట్టే దాటలేకపోయింది. ప్రపంచ కప్ ను నాలుగుసార్లు ముద్దాడిన ఆ జట్టుకు ఇది మరో పెద్ద షాకే. 2018లో అంటే బ్యాడ్ లక్ కొద్దీ మొదటి రౌండ్ లోనే వెనుదిరిగిందని సరిపెట్టుకుంటే ఇప్పుడలా కాదు. మంచి అవకాశాలు ఉండి కూడా లక్ కలిసి రాలేదు. దీంతో మరోసారి ఉసూరుమంటూ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఏం జరిగింది?

ఫిఫా 2022 ప్రపంచ కప్ లో జర్మనీ గ్రూప్ ఈలో ఉంది. ఇదే గ్రూప్ లో మాజీ చాంపియన్ స్పెయిన్, జపాన్, కోస్టారికా కూడా ఉన్నాయి. కాగా, బలాబలాల రీత్యా చూసినా, అనుభవం ప్రకారం లెక్కేసినా గ్రూప్ లో జర్మనీ నే ఫేవరెట్. మిగతా మూడు జట్లపై కనీసం రెండు విజయాలతో నాకౌట్ (16 జట్ల తదుపరి రౌండ్)కు చేరుతుందని అంచనా వేశారు.

కానీ, జపాన్ గత వారం జర్మనీకి షాకిచ్చింది. 2-1తో మాజీ చాంపియన్ ను ఓడించింది. దీంతో జర్మనీకి మొదటే షాక్ తగిలింది. దాన్నుంచి కోలుకుని బయటపడదాం అనుకుంటే స్పెయిన్ రూపంలో మరో గట్టి ప్రత్యర్థి ఎదురైంది. ఆ జట్టుపై 1-1తో మ్యాచ్ ను డ్రా చేసుకున్నా.. కోస్టారికాను 4-2తో ఓడించినా ఫలితం లేకపోయింది.

ఎందుకిలా జరిగింది..?

గ్రూప్ ఈ ప్రపంచ కప్ లో గ్రూప్ ఆఫ్ డెత్. జర్మనీ, స్పెయిన్ లాంటి జట్లు ఉండడమే దీనికి కారణం. కాబట్టి జర్మనీ మొదటే జాగ్రత్త పడాల్సింది. కానీ, జపాన్ చేతిలో చేజేతులా ఓడింది. 1-0 ఆధిక్యంలో నిలిచి మరీ తర్వాత రెండు గోల్స్ ఇచ్చింది. ఆ నష్టాన్ని భర్తీ చేయాలంటే స్పెయిన్ మీద కచ్చితంగా గెలవాలి. కానీ, అది గట్టి జట్టు. 1-1తో డ్రా అయింది.

ఇక కోస్టారికాపై 4-2తో గెలిచినా.. జర్మనీకి కోలుకోలేని పరోక్ష దెబ్బ జపాన్ కొట్టింది. జర్మనీని ఓడించినట్లే స్పెయిన్ నూ 2-1తో ఓడించిన జపాన్ గ్రూప్ లో టాపర్ గా నిలిచింది. దీంతో జర్మనీ కేవలం ఒకటే గెలుపుతో ఇంటి దారి పట్టింది. కాగా, కోస్టారికాను 7-0తో చితక్కొట్టిన స్పెయిన్ కూడా గ్రూప్ లో ఒకే విజయం సాధించింది. దాని ఖాతాలోనూ మూడే పాయింట్లున్నాయి. అయితే, గోల్స్ సంఖ్యలో మెరుగుదల కారణంగా గ్రూప్ లో రెండో స్థానంతో నాకౌట్ కు అర్హత సాధించింది.

గుండె పగిలిన అభిమానులు

జర్మనీ అంటే యూరప్ ఖండపు ఫుట్ బాల్ రారాజు. ఇప్పటివరకు నాలుగు సార్లు ప్రపంచ విజేత. దక్షిణ అమెరికా ఖండపు జట్టు బ్రెజిల్ అత్యధికంగా ఐదుసార్లు ప్రపంచ కప్ గెలిచింది. అయితే, ఆ జట్టు కంటే ప్రపంచ కప్ లో జర్మనీది మెరుగైన ప్రయాణం. అలాంటిది వరుసగా రెండోసారీ లీగ్ దశలోనే నిష్క్రమించడం జర్మనీ అభిమానులను హతాశులను చేసేదే. మరోవైపు తమ జట్టు ఓటమిని ''అత్యంత విషాదకరం'' అంటూ జర్మనీ ఫుట్ బాల్ దిగ్గజం గెరార్డ్ ముల్లర్ అభివర్ణించడమే దీనికి నిదర్శనం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News