రాయితీ ఉల్లి.. తెలుగు రాష్ట్రాల్లో ఆధార్ కార్డు ఉంటేనే!

Update: 2019-11-25 07:50 GMT
ఉల్లి ధర పతాక స్థాయికి చేరడంతో తెలుగు రాష్ట్రాల్లో సామాన్యులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఉల్లిపాయల విషయంలో.. అయితే అతివృష్టి కాకపోతే అనావృష్టి అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. కొన్ని సార్లు ఉల్లిధర రికార్డు స్థాయి కి చేరుతుంది. మరి కొన్ని సార్లు.. అసలు ధర ఉండదు.

రైతులు అప్పుడు నష్టపోతూ ఉంటారు. ఇప్పుడు కూడా రైతులకు దక్కేదేమీ పెద్దగా ఉండదు. దిగుబడి తక్కువగా ఉన్న సమయం లో కృత్రిమ కొరతలు సృష్టించి దళారులు సొమ్ము చేసుకుంటూ ఉంటారు. రైతుల నుంచి తక్కువ ధరకు కొనడం, వాటిని వినియోగదారులకు ఎక్కువ ధరకు అమ్మడం జరుగుతూ ఉంటుంది.

ఈ సంవత్సరం భారీ వర్షాల ఫలితంగా స్థానికంగా ఉల్లిదిగుబడి తగ్గినట్టుగా ఉంది. ఈ క్రమంలో ధర ఆకాశాన్ని అంటుతూ ఉంది. అయితే పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంది.

ఏపీలో రైతు బజార్లలో ఉల్లి అమ్మకం కేంద్రాల ఏర్పాటు జరిగింది. అక్కడ కేజీ ఉల్లి ఇరవై ఐదు రూపాయలకు అమ్ముతూ ఉన్నారు. అయితే ఎవరు ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చే పరిస్థితి లేదట. ఒక్కో ఆధార్ కార్డుకు కేజీ ఉల్లిపాయల చొప్పున అమ్ముతున్నట్టుగా సమాచారం. ఇరవై ఐదు రూపాయలకు కేజీ ఉల్లి విషయంలో కూడా వినియోగదారులు క్యూ కడుతూ ఉన్నారు. మొత్తానికి ఉల్లి కోయకుండానే కన్నీరు పెట్టిస్తున్నట్టుగా ఉంది!
Tags:    

Similar News