ఆఫీస్ అమరావతి.. దందా ఢిల్లీలో.. 8 కోట్ల డీల్ ముంచిందా?

Update: 2020-08-27 13:30 GMT
ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన జగన్ అవినీతి లేని పాలనను అందిస్తానని మాట ఇచ్చాడు. ఆ దిశగా చర్యలు చేపట్టాడు. 15 నెలల్లో రివర్స్ టెండర్స్ నుంచి ప్రతీ ప్రభుత్వ పథకాల్లో పారదర్శకతకు పెద్ద పీట వేశాడు. కానీ కొందరు అధికారుల చేతివాటం ప్రభుత్వ ప్రతిష్టను మసక బారిస్తోందన్న ఆవేదన వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ సీఎం కార్యాలయంలో గత 15 నెలల నుంచి పరిశీలిస్తే ఆ ముఖ్యమైన అధికారిదే పెత్తనమంతా సాగుతోందని ఎవరిని అడిగినా చెబుతారు. కానీ గత వారం నుంచి ఆ అధికారి పెత్తనానికి కత్తెర పడిందట.. ఎందుకని ఆరాతీయగా ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.

ఉత్తర భారతానికి చెందిన ఒక అధికారికి ఏపీ సచివాలయంలో పెద్ద ఎత్తున పలుకుబడి ఉంది. అతడి ఆలోచనల్లోంచే విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలన్నది పుట్టిందట.. అంతా తనే అయ్యి నడిపించాడంట.. సచివాలయంలో కానీ ఆయన నిర్ణయాలకు తిరుగుండేది కాదు..

కానీ ఈ మధ్య ఒక నార్త్ ఇండియా కంపెనీకి ఒక కాంట్రాక్ట్ డీల్ విషయంలో ఆయన చేతివాటం ప్రదర్శించాడనే ఆరోపణలు గుప్పుమన్నాయి. సదురు అధికారే ఈ డీల్ లో అన్నీ తానై వ్యవహరించాడట.. ఢిల్లీలో 8 కోట్లతో డీల్ సెట్ చేసుకున్నాడట.. అది కాస్తా జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

ఒక ఆఫీసర్ అంత పెద్ద డీల్ చేయడం సచివాలయంలో.. ఏపీ ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమైందట. ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చిస్తున్నారు. ఏపీ సీఎం రాజధాని కూడా లేని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కృతనిశ్చయంతో ఉంటే.. ఇలాంటి అధికారులతో చెడ్డపేరు వస్తోందని.. ఇటువంటి వారిని తీసివేస్తే గానీ రాష్ట్రంలో అవినీతి అంతం కాదని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంచి అధికారులను ఏపీ ప్రభుత్వ వ్యవహారాల్లో పెట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయని సచివాలయంలో అనుకుంటున్నారు.

గత చంద్రబాబు హయాంలోని ఇలాంటి కథలే పెద్ద ఎత్తున నడిచాయనే ఆరోపణలున్నాయి. జగన్ ప్రభుత్వం వచ్చాక ఆ అవినీతి అధికారులకు పవర్స్ అన్నీ కట్ అయ్యాయి. ఇప్పుడు సీఎంవో ఆఫీసులో కూడా వారు ఎవ్వరికీ ఎంట్రీ లేదట. కానీ జగన్ నమ్మిన అధికారులు కూడా ఇలా చేయడంతో ప్రభుత్వానికి అప్రతిష్ట వస్తుందనే ఆవేదన అందరిలోనూ వ్యక్తమవుతోందట.. ఇప్పుడు ఇదే టాపిక్ సచివాలయంలో హాట్ టాపిక్ గా మారి జోరుగా చర్చ జరుగుతోంది.
Tags:    

Similar News