‘తెల్లగీత’ అవతల ఆరింటికే సందడి షురూ

Update: 2016-02-02 04:56 GMT
వాడీ వేడిగా సాగిన ఎన్నికల ప్రచారం ముగిసి.. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన పోలింగ్ రోజు వచ్చేసింది. సార్వత్రిక ఎన్నికల సందడికి ఏమాత్రం తగ్గకుండా సాగిన జీహెచ్ ఎంసీ ఎన్నికల ప్రచారానికి తగ్గట్లే.. పోలింగ్ సందడి కూడా అదే తీరులో ఉంది. ఉదయం ఆరుగంటల సమయానికే గ్రేటర్ పరిధిలోని పోలింగ్ బూత్ ల వద్ద సందడి మొదలైంది. పోలింగ్ కు ముందే ఆయా పార్టీలకు చెందిన నేతలు.. కార్యకర్తలు చేరుకోవటం కనిపించింది.

పోలింగ్ జరిగే కేంద్రానికి వంద మీటర్ల దూరంలో తెల్లగీత వరకు పరిమితులు విధించే అంశం తెలిసిందే. దీనికి తగ్గట్లే.. తెల్లగీతకు అవతల పక్కన పొద్దు పొద్దున్నే సందడి నెలకొంది. పెద్ద కార్లు బారులు తీరుతూ.. పోలింగ్ కు వచ్చే వారికి అవసరమైన స్లిప్పులు అందించేందుకు ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలు సిద్ధమయ్యారు.

పోలింగ్ సరళిని గుర్తించేందుకు.. ఓట్లు వేయటానికి వచ్చే ఓటర్ల సందడిని గుర్తించేందుకు వీలుగా ప్రధాన పార్టీల కార్యకర్తలు అలెర్ట్ గా ఉండటం కనిపించింది. ఏదో గ్రేటర్ ఎన్నికలు అన్నట్లు కాకుండా.. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కనిపించే సందడి అంతా పార్టీల్లో కనిపిస్తోంది. మరి..ఆ సందడి ఓటర్లలో ఉందా? అన్నది తేలాలంటే.. పోలింగ్ నమోదయ్యే శాతం లెక్కలు తేలితే ఇట్టే అర్థమవుతుంది.
Tags:    

Similar News