మజ్లిస్ గెలుపుపై కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Update: 2019-10-26 10:03 GMT
హైదరాబాద్ మహానగరంలో తన సత్తా చాటటమే కాదు.. తనదైన ఓటుబ్యాంకును ఎవరూ టచ్ చేయనిరీతిలో తయారు చేసుకున్న మజ్లిస్.. మహారాష్ట్రలోనూ గడిచిన కొంతకాలంగా పరిమిత స్థాయిలో తన ప్రభావాన్ని చూపించటం తెలిసిందే. హైదరాబాద్ పాతబస్తీ ఫార్మూలాను ముస్లిం మైనార్టీలో ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో అమలు చేయాలన్నది ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆలోచనగా చెప్పకతప్పదు.

ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. ఉప ఎన్నికల బరిలోనూ దిగటం ఈ మధ్యన ఎక్కువైంది. ఇదిలా ఉంటే.. రెండు రోజుల క్రితం వెల్లడైన ఉప ఎన్నికల ఫలితాల్లో బిహార్ లోని కిషన్ గంజ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో మజ్లిస్ అభ్యర్థి విజయం సాధించటం సంచలనంగా మారింది. ఈ గెలుపుపై అదే రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

బిహార్ లో మజ్లిస్ గెలవటం జిన్నా భావజాలం వ్యాప్తి చెందుతోందన్న ఆయన.. వందేమాతరాన్ని ద్వేషించే మజ్లిస్ కారణంగా రాష్ట్రంలో సామాజిక సమగ్రతకు భంగం వాటిల్లే అవకాశం ఉందన్నారు. బిహార్ ప్రజలు తమ ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలంటూ ఆయన చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.

గిరిరాజ్ సింగ్ చేసిన ట్వీట్ కు జేడీయూ సీనియర్ నేత కమ్ బిహార్ రాష్ట్ర మంత్రి శ్యామ్ రజాక్ ధీటుగా బదులిచ్చారు. ట్వీట్ తో పంచ్ వేసిన ఆయన.. గిరిరాజ్ సింగ్ కు నిజంగానే బిహార్ మీద ప్రేమ ఉండి ఉంటే.. తక్షణం తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. కేంద్ర కాబినెట్ నుంచి బయటకు వచ్చేసి.. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసే పని చేయాలంటూ ట్వీట్ పంచ్ విసిరారు. మళ్లీ బిహార్ గురించి నోరు తెరవాలంటే జంకేలా చేసిన ఆయన వ్యాఖ్య ఇప్పుడు ఆసక్తికరమైంది.


Tags:    

Similar News