ఏపీలో చినబాబును అనేందుకు ఉత్సాహపడే నేతలు కోకొల్లులుగా కనిపిస్తారు. మైక్ పట్టుకొని నాలుగు మాటలు మాట్లాడినంతనే ఏదో ఒక తప్పును అన్యాపదేశంగా మాట్లాడేసి అడ్డంగా బుక్ కావటం కనిపిస్తుంది. చినబాబును ముద్దుగా ఏమని పిలుచుకుంటారో రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికి తెలిసిందే. ఏపీలో చినబాబుకు ఎలాంటి ఇమేజ్ ఉందో.. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ రథసారధిగా ఉన్న రాహుల్ గాంధీకి ఇదే తరహా ఇమేజ్ ఉంది.
అమూల్ బేబీ అంటూ రాజకీయ ప్రత్యర్థులు ఆయన్ను ముద్దుగా పిలుచుకుంటుంటారు. బీజేపీ నేతలకైతే రాహుల్ ను ఉద్దేశించి విమర్శలు చేయటంలో ముందుంటారు. ఏ చిన్న అవకాశం వచ్చినా విడిచి పెట్టరు. రాహుల్ గాలి తీయటంలో ఎక్స్ పర్ట్స్ లాంటి నేతలు కొందరు ఉంటారు. అలాంటి వారిలో కేంద్రమంత్రి గిరిరాజ్ ఒకరు. ఆయనకు రాహుల్ పై విమర్శలు చేయటం అంటే మహా ఇంట్రస్ట్.
తాజాగా ఆయన్ను ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్య అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆయనేమన్నారన్నది చూస్తే.. రాహుల్ గాంధీ సీరియస్ రాజకీయవేత్త కాదని.. పరిస్థితుల మేర నాయకుడయ్యారన్నారు. ఒక రాణిగారి కడుపున పుట్టాడంతే అని తేల్చేశారు. ఇప్పుడున్న సమయంలో ఏ నేత అయినా కార్యకర్తల్ని వదిలి పారిపోతారా? అని ప్రశ్నించిన ఆయన.. నాన్ సీరియస్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒత్తిడిని తట్టుకోలేడంటూ ఎద్దేవా చేశారు.
"ఆయనకు ఎప్పుడు పారిపోవాలో ముందే తెలుసు. అయినప్పటికీ కాంగ్రెస్ నేతలు ఆయన్నే నేతగా ఎన్నుకున్నారు" అంటూ కసితీరా రాహుల్ ను మాటలనేశారు. కొందరికి కొంతమందిని మాటలతో ఏసుకోవటం మహా సరదాగా ఉంటుంది. గిరిరాజ్ అందుకు మినహాయింపేమీ కాదు.