రేప్ కేసు నిందితుడిని పెళ్లి చేసుకోను!

Update: 2017-07-03 12:20 GMT
తెల్లారితే పెళ్లిపీట‌లెక్కాల్సిన యువ‌తి పెళ్లి ర‌ద్దు చేసుకుంది. మ‌హిళ‌లంటే గౌర‌వం లేని వ్యక్తిని మ‌నువాడ‌న‌ని తెగేసి చెప్పింది.  ఆమె నిర్ణ‌యానికి తల్లిదండ్రులు కూడా మ‌ద్ద‌తు తెలిపారు. తనకు కాబోయే భర్త - అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్నాడని తెలుసుకొన్న పెళ్లి ర‌ద్దు చేసుకున్న ఆ యువతి అంద‌రి ప్రశంసలు అందుకుంది. ఈ ఘటన యూపీలోని బరేలీ ప్రాంతంలో జరిగింది.

బులానియా గ్రామానికి చెందిన‌ ప్రతాప్ (24)కు ఆ యువతితో పెళ్లి నిశ్చయమైంది. అతడిపై అప్పటికే దేవ్ రానియా పోలీస్ స్టేషన్ లో రేప్‌ కేసు నమోదై ఉంది. దీంతో ఆ యువ‌తి పెళ్లికి నిరాక‌రించింది. అయితే, అది తప్పుడు కేసని, తనకే పాపం తెలియదని ప్రతాప్ పెళ్లి కూతురికి న‌చ్చ‌జెప్పాడు. కానీ, పెళ్లికి ఆ యువ‌తి స‌సేమిరా అంది.

అంతేకాదు, ప్ర‌తాప్ కట్న కానుకలుగా తీసుకున్న బహుమతులు, డబ్బును తిరిగి ఇచ్చేయాలని ఆ గ్రామ పంచాయితీ పెద్దలు తీర్పిచ్చారని తెలుస్తోంది. వ‌రుడి తరఫు బంధువొకరు ఈ విషయాన్ని వధువుకు చేరవేయడంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. దీంతో ఆమె ఈ విషయాన్ని త‌ల్లిదండ్రుల‌కు, గ్రామ పెద్ద‌ల‌కు చెప్పి పెళ్లిని రద్దు చేసుకుంది.

అయితే, ఈ క‌థ‌లో ఇంకో మెలిక ఉంది. స‌ద‌రు అత్యాచార బాధితురాలు తన ఫిర్యాదును న్యాయమూర్తి ముందు ఉపసంహరించుకుంది. దీంతో ప్రతాప్ పై ఈ సంవత్సరం జూన్ లో నమోదైన కేసును మూసి వేయాలని నిర్ణయించుకున్నామని పోలీసులు వెల్లడించడం గమనార్హం. ఈ పెళ్లి రద్దయిన తరువాత పోలీసులు మీడియాకు ఈ విషయం చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News