పుట్ పాత్ మీద టీ తాగిన కేంద్ర‌మంత్రి

Update: 2017-12-27 04:46 GMT
టీ అమ్మే వారి విష‌యంలో అధికార‌పక్షం ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తోంది. ప్ర‌ధాన‌మంత్రి కుర్చీలో మోడీని కూర్చోబెట్టిన టీ సెంటిమెంట్‌ను కేంద్ర‌మంత్రుల‌తో స‌హా బీజేపీ నేత‌లు ఆచితూచి అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఏ మాత్రం చుల‌క‌న చేయ‌కుండా కేర్ ఫుల్ గాఉంటున్నారు. తాజాగా ఒక టీ అమ్మే అమ్మాయి విష‌యంలో కేంద్ర‌మంత్రి వ్య‌వ‌హ‌రించిన తీరుపై ప‌లువురు పాజిటివ్ గా రియాక్ట్ కావ‌ట‌మే కాదు.. ఆయ‌న ఇమేజ్ గ్రాఫ్ పెరిగేందుకు సాయం చేసింది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని గాజీపూర్ లో టీ అమ్మే బాలిక ఆర‌తి ఇప్పుడు ఒక్క‌సారిగా వార్త‌ల్లోకి వ‌చ్చింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కూ ఎలాంటి గుర్తింపు లేని ఆమె ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించ‌టమే కాదు.. ఆమెకు గౌర‌వ మ‌ర్యాద‌లు ఒక్క‌సారిగా పెరిగిపోయాయి. ఇంత‌కీ. ఆర‌తి స్పెసాలిటీ ఏమిటి? ఉన్న‌ట్లుండి ఆమెకు అంత పేరు ఎందుకు వ‌చ్చిందంటే.. అది మోడీ టీంలోని కేంద్ర‌మంత్రి మ‌నోజ్ సిన్హా కార‌ణంగా చెప్పాలి.

త‌ల్లిదండ్రుల అనారోగ్యానికి గురి కావ‌టంతో.. తండ్రి న‌డిపిన టీ దుకాణాన్ని త‌న‌కు తానుగా నిర్వ‌హిస్తున్న ఆర‌తి అనే బాలిక ఉదంతం గురించి తెలిసిన కేంద్ర‌మంత్రి ఆమె న‌డుపుతున్న టీ దుకాణం వ‌ద్ద‌కు వెళ్లారు. బీకాం చ‌దువుతూ.. రోడ్డు ప‌క్క‌న పుట్ పాత్ మీద టీ అమ్మే ఆమె వైనం గురించి తెలిసి ఆమె ద‌గ్గ‌ర‌కు వెళ్లారు.

త‌ల్లిదండ్రుల‌కు అనారోగ్యం.. ఇద్ద‌రు త‌మ్ముళ్ల బాధ్య‌త త‌న మీద‌నే ఉండ‌టంతో.. సాయం కోసం చేతులు జాచే క‌న్నా.. క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తే బాగుంటుంద‌న్న ఆలోచ‌న‌తో తండ్రి న‌డిపిన టీ షాపును తాను నిర్వ‌హిస్తున్న‌ట్లుగా కేంద్ర‌మంత్రి మ‌నోజ్ సిన్హాకు చెప్పింది ఆర‌తి.

ఆమె మాట‌లు విన్న కేంద్ర‌మంత్రి స్పందించి.. ఆమె చ‌దువుకోవ‌టానికి రూ.40వేల స్కాల‌ర్ షిప్ వ‌చ్చేలా చేయ‌టంతో పాటు.. ఆమెకు అండ‌గా ఉంటాన‌న్నారు. ఆర‌తి చేసి ఇచ్చిన టీను తాగిన కేంద్ర‌మంత్రిపై ఇప్పుడు ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. ఆర‌తికి కేంద్ర‌మంత్రి చేసిన సాయం కంటే.. స‌ద‌రు బాలిక కార‌ణంగా కేంద్ర‌మంత్రి గ్రాఫ్ మ‌రింత పెరిగింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News