జ్ఞానవాపి మసీదు కేసు: ఆఖరుకు జడ్జీకి బెదిరింపులా?

Update: 2022-06-08 09:07 GMT
అయోధ్యలో బాబ్రీ మసీదు వివాదం తర్వాత దానికి దగ్గరలో ఇదే యూపీలో మరో వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా మరోసారి ఉద్రిక్తతలకు కారణమవుతోంది. మరో అయోధ్య వివాదంలా మారుతోంది. బాబ్రీ మసీదు అయోధ్య రాముడి జన్మస్థలంగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడం దేశంలో ఎంతటి అలజడులకు కారణమైందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు జ్ఞానవాపి మసీదు కేసులో కూడా ఇదే మాదిరి వివాదం నడుస్తోంది.

తాజాగా జ్ఞానవాపి మసీదు కేసులో విచారణ జరుపుతున్న జడ్జీకి కొందరు దుండగులు బెదిరింపులకు పాల్పడడం సంచలనమైంది. జ్ఞానవాపి మసీదు సముదాయాన్ని వీడియో తీయాలని ఆదేశించిన సీనియర్ డివిజన్ జడ్జి రవికుమార్  దివాకర్ కు మంగళవారం బెదిరింపు లేఖ రావడం కలకలం రేపింది.  దీంతో యూపీ ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. ఈ సున్నితమైన జ్ఞానవాపి విషయంలో ఉద్రేకాలు రావడం సహజం కావడంతో న్యాయమూర్తికి రక్షణగా తొమ్మిది మంది పోలీసులను ఏర్పాటు చేసింది. అదే సమయంలో ఈ విషయంపై విచారణ జరుగుతోంది. అదనపు చీఫ్ సెక్రటరీ, డీజీపీ, వారణాసి పోలీస్ కమిషనర్ లు దృష్టి సారించి బెదిరింపు లేఖపై విచారణ జరుపుతున్నారు.

జడ్జీ దివాకర్ కు రాసిన లేఖలో 'ఇస్లామిక్ ఆగాజ్ ఉద్యమం'తరుఫున ఈ  లేఖ తనకు పంపినట్లు న్యాయమూర్తి వెల్లడించారు. తనకు మంగళవారం బెదిరింపు లేఖ వచ్చినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇస్లామిక్ అఘాజ్ మూవ్ మెంట్ కు చెందిన కాషిఫ్ అహ్మద్ సిద్దిఖీ నుంచి బెదిరింపు లేఖ వచ్చినట్టుగా వారణాసి సివిల్ జడ్జీ తెలిపారు.జడ్జికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఈ లేఖ అందిందని సమాచారం. దాంతోపాటు మరికొన్ని పేపర్లు కూడా ఉన్నాయి.

ఈ సమాచారాన్ని జడ్జి తొలుత పోలీసులకు వెల్లడించడంతో వారణాసి పోలీస్ కమిషనర్ దీన్ని ప్రత్యేకంగా విచారిస్తున్నట్టు సమాచారం. జడ్జి దివాకర్ భద్రతలో మొత్తం 9 మంది పోలీసులను మోహరించినట్లు సీపీ గణేష్ తెలిపారు. అంతేకాకుండా వారి భద్రతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. జ్ఞానవాపి వివాదంలో తీర్పును ప్రభావితం చేసేలా ఏకంగా జడ్జీని హెచ్చరిస్తూ లేఖ పంపడం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనమైంది.

-అసలు జ్ఞానవాపి వివాదం ఇదీ..యూపీలో బాబ్రీ మసీదు తరువాత అంతటి పేరు ప్రఖ్యాతలున్న మరో మసీదు  జ్ఞానవాపి   మసీదు. అయితే ఈ మసీదు ఒకప్పటి శివాలయాన్ని కూల్చేసి నిర్మించారని కోర్టును ఆశ్రయించారు. చరిత్ర చెబుతున్న ప్రకారం.. 2000 ఏళ్ల కిందట విక్రమాదిత్యుడు కాశీ విశ్వనాథుడికి ఆలయం కట్టించాడు. 1194లో మహ్మద్ ఘోరీ సైన్యాధిపతి కుతుబుద్దీన్ ఐబక్ కన్నౌజ్ రాజును ఓడించినప్పుడు ఆలయాన్ని కూల్చేశారు. ఆ తరువాత 1211లో గుజరాత్ కు చెందిన ఓ రాజు ఆలయాన్ని పునరుద్దరించారు. ఆ తరువాత 1458లో మళ్లీ హుస్సేన్ షా షర్కీ హయాంలో కూల్చేసినట్లు చెబుతున్నారు. ఔరంగజేబు మొఘల్ సింహాసనాన్ని అధిష్టించిన తరువాత 1669 ఏప్రిల్ 4న కాశీ విశ్వనాథుడి గుడిని కూల్చివేసి ఆలయ గోడల మీదుగా మసీదును నిర్మింపజేశాడు.

ఈ క్రమంలో గర్భగుడిలోని విశ్వేశ్వరుడి జ్యోతిర్లింగాన్ని కూడా ధ్వంసం చేస్తారేమోనన్న భయంతో అక్కడి పూజారి శివలింగాన్ని పెకలించి అక్కడే ఉన్నజ్ఞానవాపి(బావి)లో వేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అలాగే పూజారి కూడా ఆ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు అంటున్నారు. ఆ బావి పేరిటే  జ్ఞానవాపి   మసీదు అని పేరు వచ్చింది. ఈ మసీదు దక్షిణపు గోడలను పరిశీలిస్తే రాతి శిలాతోరణాలు, చెక్కడాలు కనిపిస్తాయి. దీంతో ఇక్కడ ఆలయం ఉండేదని అనిపిస్తుంది. అయితే ఈ గోడను స్థానిక ముస్లింలు ‘ఖిబ్లాకుడ్యం’గా పరిగణిస్తారు.

1742లో మరాఠా సుబేదార్ మల్హర్ రావు హోల్కర్ కాశీ ఆలయానికి పూర్వ వైభవం తేవాలని నిర్ణయించాడు. అయితే అప్పుడు లఖ్ నవూను నవాబులు పాలిస్తున్నందున ఆయన ప్రయత్నాలు సాగలేదు. అనంతరం ఆయన కోడలు అహిల్యాబాయ్ హోల్కర్ హయాంలో కాశీవిశ్వనాథుడికి ఆలయం ఏర్పడింది. అప్పుడు నిర్మించిందే ఇప్పటి కాశీ విశ్వనాథ ఆలయం. కొందరు ముస్లింలు మాత్రం ఇక్కడ అక్బర్ స్థాపించిన దీన్ -ఇ-ఇలాహీ మతానికి చెందిన కట్టడం ఉండేదని అంటున్నారు.

ఇక జ్ఒాన వాపి మసీదు వెనకాల ఆలయం ఉండేదని ఇక్కడ పూజలకు అనుమతి ఇవ్వాలని 1991 అక్టోబర్ 15న పండిట్ సోమ్ నాథ్ వ్యాస్, డాక్టర్ రామ్ రంగ్ శర్మ తదితరులు వారణాసి కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఈ కేసు పెండింగ్ లో ఉంది. 2019లో సుప్రీం కోర్టు రామాలయాన్ని నిర్మించాలని తీర్పునిచ్చిన నేపథ్యంలో జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఆర్కియాలాజికల్ సర్వే నిర్వమించాలని విజయ్ శంకర్ రస్తోగీ వేరే పిటిషన్ వేశారు. 2021 ఏప్రిల్ 8న కోర్టు దీనిపై ఉత్తర్వులిచ్చింది. ఈ క్రమంలో యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు, అంజుమన్ ఇంతెజామియా మస్జిద్ కమిటీ అలహాబాద్ కోర్టును ఆశ్రయించగా స్టే ఇచ్చింది.

2021లో ఢిల్లీకి చెందిన విశ్వ వేదిక్ సనాతన్ సంఘ్ అనే సంస్థకు చెందిన ఐదుగురు మహిళలు కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో జిల్లా కోర్టు జడ్జి రవికుమార్ దివాకర్ ఈ ప్రాంతంలో వీడియో గ్రఫీ, సర్వే నిర్వహించేందుకు ఓ కమిటీని వేశారు. తాజాగా నిర్వహించిన సర్వేలో జ్ఞానవాపిలో శివలింగం బయటపడింది. దీంతో ఆ ప్రాంతాన్ని సీల్ చేయాలని, అక్కడికి ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తపడాలని స్థానిక కోర్టు అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ సాగుతోంది. జడ్జీని బెదిరించడంతో కేసు సంచలనమైంది.
Tags:    

Similar News