ఆ జీవో పెద్ద తలనొప్పిగా మారిపోయిందిగా జగన్!

Update: 2022-07-21 10:30 GMT
ఇవాళ సీఎం జ‌గ‌న్  ఆధ్వ‌ర్యాన పాఠ‌శాల విద్య‌పై స‌మీక్ష జరుగుతోంది. ఈ చ‌ర్చ‌ల్లో విద్యా శాఖ మంత్రి బొత్స ఉన్నారు. ప్ర‌భుత్వ బ‌డుల విలీనంపై ఇప్ప‌టిదాకా వ‌స్తున్న వివాదాల‌ను జ‌గ‌న్ ఏ మేర‌కు ప‌రిష్క‌రిస్తారు ? అన్న సందేహం వెన్నాడుతోంది. సొంత మ‌నుషులే వ‌ద్ద‌ని అంటుంటే వారి మాట కూడా ప‌ట్టించుకోకుండా మున్ముందుకు పోయారు జగన్. ఆయన చెప్పింది  చేసేశారు విద్యా శాఖ మంత్రి.
 
పరిస్థితి తిరగబడటంతో పాఠ‌శాల‌ల విలీనంపై మ‌రోసారి స‌ర్వే చేయాల‌ని విద్యా శాఖ భావిస్తున్నదిపుడు. అయినా తాజా చ‌ర్య‌లు ఏ మేర‌కు స‌త్ఫ‌లితాలు ఇవ్వ‌నున్నాయో ఓ సందేహ‌మే ! ఎందుకంటే విద్యార్థుల సంఖ్య‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకునే తాము ఈ విధంగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల సంఖ్య‌ను త‌గ్గించుకోవాల్సి వ‌స్తుంద‌ని, సంబంధిత భ‌వనాల‌ను ప్ర‌భుత్వ కార్యాల‌యాలుగా మార్చేస్తామ‌ని మంత్రి బొత్స‌తో సహా ఇత‌ర అధికార పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. కానీ ఈ నిర్ణ‌యం కార‌ణంగా వేలాది మంది గ్రామీణ, గిరిజ‌న విద్యార్థుల భ‌విత‌వ్యం అంధ‌కారంలోకి వెళ్తుంద‌ని  ఓ వాద‌న వినిపిస్తోంది. అయినా కూడా కొంత ప‌ట్టుద‌ల‌తోనే బొత్స ఉన్నార‌న్న విమ‌ర్శ కూడా ఉంది.  ఈ నేప‌థ్యంలో సీఎం ఎటుంటి నిర్ణ‌యం తీసుకుంటారో అన్న ఆసక్తి స‌ర్వ‌త్రా నెల‌కొని ఉంది.

తన నిర్ణ‌యం త‌ప్ప‌యితే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని విద్యాశాఖ మంత్రి బొత్స ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. కానీ బొత్స నిర్ణ‌యం త‌ప్పేన‌ని, ప్ర‌భుత్వ నిర్ణ‌యం కార‌ణంగా ఐదు వేల‌కు పైగా బ‌డులు మూత‌ప‌డ‌డమే కాదు, అత్యంత సంక్లిష్ట స్థితుల్లో కూడా బ‌డులు నిర్వ‌హించే ప్రాంతాలకు ఇప్పుడు  కొత్త స‌మ‌స్య‌లు వ‌చ్చి ప‌డ్డాయ‌ని  అంటూ, ఉపాధ్యాయ సంఘాలు  మండిప‌డుతున్నాయి. దీంతో పాఠ‌శాల‌ల ర‌ద్దు లేదా విలీనం పేరిట న‌డుస్తున్న చ‌ర్య‌ల‌న్నింటినీ నిలుపుద‌ల చేయాల‌ని కోరుతూ ప‌లు సంఘాలు ఇప్ప‌టికే ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశాయి. అయినా కూడా ఎక్క‌డా ఎటువంటి చర్య‌లూ చేప‌ట్ట‌లేదు.

సానుకూలంగా ప్ర‌క‌ట‌నే రాలేదు. పైగా సొంత మ‌నుషులు చెబుతున్నా కూడా బొత్స విన‌కుండా ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల అమలు చేస్తున్నార‌న్న వాద‌న‌లూ వ‌స్తున్నాయి. ఇవి ఎలా ఉన్నా త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్ ను  గంద‌ర‌గోళంలో ప‌డేసే జీఓ 117 ను రద్దు చేయాల‌ని లేదంటే సవ‌రించి కొత్త జీవో ఒక‌టి విడుద‌ల చేయాల‌ని అధికార పార్టీ ఎమ్మెల్యేలు సీఎంను వేడుకుంటున్నారు.

నాడు నేడు పేరిట బ‌డులు బాగు చేశాం అని చెప్పుకుంటున్న  ప్ర‌భుత్వ వ‌ర్గాలు  విలీనం పేరిట ఎందుక‌ని వెన‌క్కు త‌గ్గ‌డం లేదు అన్న ప్ర‌శ్న ఒక‌టి ఉపాధ్యాయ వ‌ర్గాల నుంచి ఎదురవుతోంది. బ‌డులను కాపాడుకోవ‌డం కూడా తమ బాధ్య‌తే అని, జీవో నంబ‌ర్ 117లో ఉన్న కొన్ని పొరపాట్లను దిద్దాలని.. వీలైతే వెంట‌నే ఈ జీఓనే ర‌ద్దు చేయాల‌ని కోరుతూ ఏపీటీఎఫ్ ఆందోళ‌న బాట‌ప‌ట్టింది. అదేవిధంగా మూడు, నాలుగు, ఐదు త‌ర‌గ‌తుల‌ను ఏ విధంగా ఉన్న‌త పాఠ‌శాల‌ల్లో విలీనం చేస్తార‌ని ఇది కూడా నిర్హేతుకంగానే ఉంద‌ని ఆవేద‌న చెందుతోంది. అంతేకాదు అన్ని ప్ర‌భుత్వ, ప్ర‌భుత్వ యాజ‌మాన్య ప‌రిధిలో ప‌నిచేస్తున్న పాఠ‌శాల‌ల్లో రెండు మాధ్య‌మాల్లోనూ (ఇంగ్లీషు మరియు తెలుగు) బోధ‌న సాగేందుకు వీలుగా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, అప్పుడే గ్రామీణ విద్యార్థికి న్యాయం చేసిన వారు అవుతార‌ని అంటున్నారు. ఇప్ప‌టికే పాఠ‌శాల‌ల విలీనంను వ్య‌తిరేకిస్తూ నిన్న‌టి వేళ పార్ల‌మెంట్ లో సంబంధిత అంశాన్ని తాను లేవ‌నెత్తాన‌ని యువ ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు తెలిపారు.

ఈ నేప‌థ్యంలో పాఠ‌శాల‌ల విలీనానికి సంబంధించి ఇప్ప‌టిదాకా రేగుతున్న వివాదాల‌న్నీ మ‌రోసారి పున‌రావృతం అవుతున్నాయి. ఎందుకంటే మంత్రి బొత్స త‌న నిర్ణ‌యంపై పున‌రాలోచ‌న చేయ‌కుండా మాట్లాడుతుండ‌డ‌మే ఇందుకు కార‌ణం అని తెలుస్తోంది. ముఖ్యంగా విలీనం కార‌ణంగా ప్ర‌యివేటు యాజ‌మాన్యాల‌కే లబ్ధి చేకూరుతుంద‌ని పేర్కొంటూ ఇప్ప‌టికే ప‌లు ఉపాధ్యాయ సంఘాలు    త‌మ నిర‌స‌న‌లు తెలుపుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇవాళ క‌లెక్ట‌రేట్  ఎదుట ఏపీటీఎఫ్ వ‌ర్గాలు ఆందోళ‌న‌లు చేప‌ట్టాయి. వీటి కార‌ణంగా అయినా ప్ర‌భుత్వం దిగివ‌స్తుంద‌ని ఆశించాలి.

వాస్త‌వానికి పాఠ‌శాల‌ల విలీనంపై ఇప్ప‌టికే అర‌వై  మంది ఎమ్మెల్యేలు మంత్రి బొత్స‌కు లేఖ‌లు రాశార‌ని తెలిసింది. కానీ ఆ సంఖ్య ఇప్పుడు 70 దాటి పోయింది. విలీనాన్ని వ్య‌తిరేకిస్తూ సంబంధిత నిర్ణ‌యాన్ని వెన‌క్కు తీసుకోవాల‌ని కోరుతూ మంత్రికి 70కి పైగా ఎమ్మెల్యేలు (వీరంతా సొంత పార్టీ మ‌నుషులే ) లేఖ‌లు రాయ‌డంతో ప్ర‌స్తుతం ఈ వివాదం చిలికి చిలికి గాలివాన‌గా మార‌బోతోంది. పాఠ‌శాల‌ల విలీనాన్ని ర ద్దు చేయాల‌ని కోరుతూ ఏపీటీఎఫ్ ఇవాళ నుంచి ఈ నెల 27వ తేదీ వ‌ర‌కూ ఆందోళ‌న‌లు చేయ‌నుంది. ఇందుకు సంబంధించి కార్యాచ‌ర‌ణ కూడా విడుద‌ల చేసింది.
Tags:    

Similar News