వాళ్ల‌కో రూల్‌? నీకో రూలా?

Update: 2018-09-25 07:11 GMT
గోవా మంత్రి మండ‌లి నుంచి ఇద్ద‌రు మంత్రుల‌ను త‌ప్పిస్తూ ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ తీసుకున్న నిర్ణ‌యం ప్ర‌స్తుతం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. అనారోగ్య కార‌ణాల‌ను చూపుతూ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఫ్రాన్సిస్‌ డిసౌజా - విద్యుత్తుశాఖ మంత్రి పాండురంగ్‌ మడ్కైకర్‌ లను మంత్రి ప‌ద‌వుల నుంచి పారిక‌ర్ సోమ‌వారం త‌ప్పించారు. మంత్రివ‌ర్గంలో ఎవ‌రెవ‌రు ఉండాల‌న్న‌ది పూర్తిగా సీఎం వివేచ‌న‌కు సంబంధించిన విష‌య‌మే. ఎవ‌రినైనా స‌రే త‌ప్పించే అధికారం - కొత్త‌వారిని చేర్చుకునే అధికారం ముఖ్య‌మంత్రికి ఉంటుంది. ఇది కాద‌న‌లేని వాస్త‌వం. అయితే, గోవాలో మంత్రి ప‌ద‌వుల నుంచి డిసౌజా - మ‌డ్కైకర్‌ ల‌ను త‌ప్పించేందుకు పారిక‌ర్ చూపించిన కార‌ణ‌మే ప్ర‌స్తుతం వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. ఎందుకంటే వారిద్ద‌రితోపాటు పారిక‌ర్ కూడా తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. చాలాకాలంగా రాష్ట్రానికి దూరంగా ఉంటున్నారు.

పారిక‌ర్ ప్ర‌స్తుతం క్లోమ సంబంధిత తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. కొన్నాళ్లు అమెరికాలో చికిత్స తీసుకున్న ఆయ‌న‌.. కొంత‌కాలంగా దేశ రాజ‌ధాని డిల్లీలోని ఎయిమ్స్‌ లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర పాల‌నా వ్య‌వ‌హారాల్లో ప్ర‌స్తుతం ఆయ‌న పాత్ర దాదాపు శూన్యం. దీనిపై ఇటీవ‌లే ప్ర‌తిప‌క్షాలు గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి ఫిర్యాదు కూడా చేశాయి. రాష్ట్రంలో పాల‌న స‌రిగా లేద‌ని.. పారిక‌ర్ ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేయాల‌ని కోరాయి. వారి స్థానంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేసే అవ‌కాశాన్ని త‌మ‌కు ఇవ్వాల‌ని కోరాయి. ఈ వివాదం కొన‌సాగుతుండ‌గానే.. ప్రస్తుతం పారిక‌ర్ అనారోగ్యాన్ని కార‌ణంగా చూపుతూ ఇద్ద‌రు మంత్రుల‌పై వేటు వేశారు. దీంతో ఇద్ద‌రు మంత్రుల‌కు వ‌ర్తింప‌జేసిన నిబంధ‌న‌ను స్వ‌యంగా మీకు మీరే ఎందుకు వ‌ర్తింప‌జేసుకోవ‌డం లేదంటూ ప్ర‌తిప‌క్షాలు, ప‌లువురు ప్ర‌జ‌లు పారిక‌ర్‌ను ప్ర‌శ్నిస్తున్నారు. డిసౌజా, మ‌డ్కైక‌ర్‌ల కంటే ముందు నుంచే పారిక‌ర్ అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు క‌దా.. వారి కంటే ముఖ్య‌మంత్రే ఎక్కువ కాలం రాష్ట్ర పాల‌నా వ్య‌వ‌హారాల‌కు దూరంగా ఉన్నారు క‌దా.. మ‌రి అలాంట‌ప్పుడు ముందు ఈయ‌నే త‌ప్పుకోవాలి క‌దా.. అని ప్ర‌శ్నాస్త్రాలు సంధిస్తున్నారు. వీటిపై పారిక‌ర్‌ - బీజేపీ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే మ‌రి!


Tags:    

Similar News