దేశానికి డాలర్ల వర్షం కురిపిస్తున్న గోదారి రొయ్యలు

Update: 2022-02-02 02:30 GMT
దేశంలో రొయ్యల పెంపకం ఒక పరిశ్రమగా ఉండే రాష్ట్రాల్లో ఏపీ ముందుంటుంది. గోదారి జిల్లాలో పెంచే రొయ్యలకు విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉండేది. గతంలో గోదావరి జిల్లాల్లో పండించే రొయ్యల్ని చైనాకు పెద్ద ఎత్తున ఎగుమతి చేసేవారు. అయితే.. డ్రాగన్ దేశం తీరుతో ఆక్వా రైతులు విసిగిపోయారు. ఏదో వంక పెడుతూ.. ఆదాయానికి కోత పెట్టే ఆ దేశంతో తీరుతో.. చైనాకు చెక్ పెట్టేసి.. వేరే దేశానికి తమ రొయ్యల్ని ఎగుమతి చేసేందుకు దారులు వెతికారు. ఇందులో సక్సెస్ అయిన గోదావరి జిల్లా రైతులపై  ఇప్పుడు డాలర్ల వర్షం కురుస్తోంది.

రొయ్యల్ని సాగు చేసే వారికి గత ఏడాది ఒక పరీక్షగా మారింది. సాగు ఖర్చులు పెరగటం.. తాము పండించిన రొయ్యలకు సరైన ధరల పలకపోవటంతో వారు కిందామీదా పడుతున్న పరిస్థితి. దీంతో.. పలువురు రొయ్యల సాగును ఆపేశారు కూడా. చైనా మార్కెట్ నుంచి ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధిగమించేందుకు అమెరికాకు రొయ్యల్ని ఎగుమతి చేసే అవకాశం లభించటం.. అక్కడ వ్యాపార అవకాశాలు ఎక్కువగా ఉండటంతో.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆక్వా రైతులు పెద్ద ఎత్తున రొయ్యల్ని ఎగుమతి చేస్తున్నారు.

మొన్నటి వరకు 6 లక్షల ఎకరాల్లో పండే రొయ్యల సాగు.. తాజాగా 8 లక్షల ఎకరాల వరకు పెరిగింది. ఇటీవల కాలంలో పశ్చిమ గోదారి జిల్లాలో పండే రొయ్యలకు అమెరికాతో పాటు.. యూరప్ దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా అరబ్ దేశాలు గోదారి జిల్లా రొయ్యల రుచికి ఫిదా అవుతున్నట్లు చెబుతున్నారు. దీంతో.. వ్యాపార అవకాశాలు భారీగా పెరగటంతో.. ఇప్పటికే ఉన్న ధరకు అదనంగా కేజీకి రూ.20 నుంచి రూ.40 వరకు రేటు పెరగటం రొయ్య రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. మరోవైపు దేశానికి కూడా డాలర్ల వర్షం కురిసేలా చేస్తోంది.

కరోనా తర్వాత విదేశాల్లో మన రొయ్యలకు గిరాకీ పెరిగింది. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఎగుమతి అవుతున్న రొయ్యల విలువ గతంలో రూ.16వేల కోట్లు ఉంటే.. గత ఏడాది రూ.18వేల కోట్లకు పెరిగాయి. ఈ ఏడాది అంతకుమించి పెరగడం ఖాయమంటున్నారు. ఒక అంచనా ప్రకారం ఈ ఏడాది రొయ్యల ఎగుమతి ఏకంగా రూ.25 వేల కోట్లకు పెరుగుతుందన్న అంచనా వ్యక్తమవుతోంది.

ప్రస్తుతం మార్కెట్లో రొయ్యల రేట్లు ఇలా ఉన్నాయి.

(ఈ ధరలు రొయ్యల రైతుకు లభిస్తున్నది కేజీ చొప్పున)

-  30 కౌంట్     రూ.610
-  40 కౌంట్‌     రూ.515
-  50  కౌంట్       రూ.420
-  60  కౌంట్       రూ.395
-  70  కౌంట్       రూ.350
-  80  కౌంట్       రూ.320
-  90  కౌంట్       రూ.275
-  100  కౌంట్       రూ.260


Tags:    

Similar News