నాలుగు రోజుల క్రితం గోదావరి లాంచీలో అగ్నిప్రమాదం జరిగిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో లాంచీ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రైవేటు లాంచీలపై అధికారుల నిఘా కొరవడడంతోనే ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఆ ఘటనను మరువకు ముందే తాజాగా నేడు గోదావరి నదిలో అదే ప్రాంతంలో ఓ లాంచీ మునిగిపోయిన ఘటన కలకలం రేపుతోంది. కొండమొదలు నుంచి రాజమండ్రి వెళుతున్న ఓ ప్రైవేటు లాంచీ దేవీ పట్నం మండలం మంటూరు దగ్గర నీట మునిగింది. ఆ ప్రమాదం జరిగిన సమయంలో లాంచీలో పెళ్లి బృందంతో సహా సుమారు 60 మంది ప్రయాణిస్తున్నారని తెలుస్తోంది. ఈ ప్రమాదం నుంచి 20 మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా మరో 40 మంది గల్లంతయ్యారు. ఈ ప్రమాద ఘటన అనంతరం లాంచీ నిర్వాహకుడు ఖాజా దేవీ పట్నం పోలీసులకు లొంగిపోయాడు.
సుడిగాలిలో చిక్కుకుని లాంచీ మునిగిపోయినట్లు కొందరు స్థానికులు చెబుతున్నారు. ఆ ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికుల ఆర్తనాదాలు విన్న గిరిజనులు సహాయక చర్యలు చేపట్టారు. నాటు పడవలో వెళ్లిన స్థానికులు గల్లంతైన ప్రయాణికుల కోసం గాలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొంతమంది గజ ఈతగాళ్లు....గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడడంతో గల్లంతైన వారికోసం సహాయక చర్యలు ఆలస్యమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రమాద బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.