భాజపా నుంచి చంద్రబాబుకు చేదు వార్త!

Update: 2017-07-20 04:14 GMT
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు త్వరలో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఏపీలో స్వతంత్రంగా అన్ని స్థానాలకు పోటీ చేయగలిగే స్థాయికి ఎదగాలని అక్కడి భాజపా నాయకులు ఎప్పటినుంచో కలలు కంటూ ఉన్న సంగతి తెలిసిందే. చాలా సందర్భాల్లో కీలక నాయకులు 2019 ఎన్నికల నాటికి సొంతంగా అన్ని స్థానాలకు పోటీచేస్తాం అంటూ ప్రకటనలు గుప్పించారు కూడా. ఆ లక్ష్యాన్ని గమనంలో ఉంచుకుని పార్టీని విస్తరించే క్రమంలో భాగంగా.. అనేక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. వీటిలో ఒక కీలక అంశంగా.. పార్టీ ఏపీ శాఖకు నూతన అధ్యక్షుడిగా ఎంపీ గోకరాజు గంగరాజును నియమించబోతున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.

భారతీయ జనతా పార్టీకి ఏపీ మీద ఎన్ని ఆశలు ఉన్నప్పటికీ.. దానికి తగ్గట్లుగా ఆ రాష్ట్రంలో పార్టీ విస్తరణ చర్యలు మాత్రం జరగడం లేదు. పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో ఎంతో క్రమశిక్షణతో ఉండే వారే.. ఏపీలో చాలాకాలంగా నూతన అధ్యక్షుడిని నియమించకుండా జాప్యం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ హోదాలో ఉన్న కంభంపాటి హరిబాబు పదవీకాలం పూర్తయి చాలాకాలమే గడచింది. కొత్త అధ్యక్షుడిగా సోము వీర్రాజు - పురందేశ్వరి తదితరులు పేర్లు ప్రాబబుల్స్ గా వినిపించాయి. ‘ఒకటి రెండు రోజుల్లో కొత్త అధ్యక్షుడి నియామకం’ అంటూ చాలా సార్లే వార్తలు వచ్చాయి. అయితే ఆచరణలో నిర్ణయం రాలేదు.

ఏపీ భాజపాకు కొత్త అధ్యక్షుడు రావడం, పార్టీ విస్తరణకు కొత్త వ్యూహాలతో దూసుకుపోవడం ఇలాంటివేమీ జరగకుండా.. చంద్రబాబునాయుడే అడ్డుపడుతున్నాడనే విమర్శలు కూడా గతంలో వినిపించేవి. కానీ ఇప్పుడు పార్టీ ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేసినట్లుగా తెలుస్తోంది. నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజును రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడుగా చేయబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆయనైతే గనుక ఆర్థిక వనరులకు వెతుకులాట కూడా లేకుండా పార్టీని వేగంగా మరో స్టెప్ ముందుకు తీసుకువెళ్లగలడనే అధిష్టానం భావిస్తోంది.

బహుశా ఈ నిర్ణయం చంద్రబాబుకు మింగుడు పడకపోవచ్చు. గత ఎన్నికల్లో చచ్చీ చెడీ అధికారంలోకి రావడానికి భాజపా మరియు పవన్ కల్యాణ్ అనే అంశాలు తెలుగుదేశానికి తోడ్పడ్డాయి. 2019 ఎన్నికల నాటికి జనసేన పార్టీ అన్నిచోట్లా పోటీచేస్తుందన్నట్లుగా పవన్ మాట్లాడుతున్నారు. భాజపా కూడా ఆస్థాయి బలం పుంజుకోడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తే.. చంద్రబాబులో ఆందోళన పెరగడం సహజం. అయితే.. ఈ సారి మాత్రం.. రాష్ట్రశాఖ అధ్యక్ష నియామకం జరగకుండా అడ్డుపడడం చంద్రబాబు చాణక్యా రాజకీయాలకు సాధ్యం కాకపోవచ్చునని పలువురు భావిస్తున్నారు.
Tags:    

Similar News