బంగారం ధరలు త్వరలో ఆ రేటుకు చేరుకుంటాయట

Update: 2022-01-27 03:28 GMT
భారీగా పెరిగిన బంగారం ధరలు’ అన్న వార్త చూడటం.. ఆ వెంటనే క్లిక్ చేయటం.. అందులో పులిహోర తప్పించి ఇంకే వివరాలు ఉండవు. ఒకవేళ ఉన్నా గ్రాముకు రూ.200 నుంచి రూ.500 మధ్య పెరిగిందని కొన్నిసార్లు.. భారీగా తగ్గింపు అంటే ఇంతే మొత్తంలో తగ్గింపు తప్పించి.. మరింకేమీ మార్పులు ఉండవు. ఆ మాత్రం దానికే తరచూ బంగారం ధరలో భారీ మార్పులు చేర్పులంటూ రాసే వార్తల పుణ్యమా అని.. ఏ మాత్రం ఆసక్తికరం లేకుండా చేస్తున్నాయి. అయితే.. మేం ఇప్పుడు చెప్పే వివరాలు మాత్రం ఈ కోవకు చెందినవి కావు.

దీపావళి వేళలో బంగారం ధరలు భారీగా పెరిగినట్లే పెరిగి.. మళ్లీ తగ్గటం చూస్తున్నాం. పెరగటం.. తగ్గటం లాంటి ఊగిసలాట బంగారం ధరల్ని చూస్తే కనిపిస్తుంది. అయితే.. రానున్న రోజుల్లో మాత్రం బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. తాజాగా రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవటం.. ఎప్పుడైనా సరే ఈ యుద్ధం షురూ కావొచ్చన్న మాట వినిపిస్తోంది. ఈ వాదనకు తగ్గట్లే.. దాదాపు ఏడేళ్ల తర్వాత క్రూడ్ ఆయిల్ ధరలు పెరగటం కూడా ఇందుకు నిదర్శనంగా చెప్పక తప్పదు.

ఇప్పటికే మూడో వేవ్ కారణంగా చోటు చేసుకున్న పరిణామాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఇప్పుడు యుద్ధం కాని మొదలైతే బంగారం ధర భారీగా పెరగటం ఖాయమంటున్నారు. తాజాగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,500లకు చేరుకోగా కిలో వెండి ధర రూ.64,500లకు చేరుకుంది.

 అహ్మదాబాద్ బిలియన్ వ్యాపారి హేమంత్ అంచనా ప్రకారం.. రష్యాతో పెరుగుతున్న ఘర్షణ పరిస్థితుల కారణంగా కొద్ది రోజుల వ్యవధిలోనే బంగారం పది గ్రాములు రూ.55,500 లకు చేరుకుంటుందని చెబుతున్నారు. స్టాక్ మార్కెట్ లో ప్రతి రోజు ఎగుమతి దారులు 2 టన్నుల వెండిని కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏమైనా రానున్న కొద్ది రోజుల్లోనే బంగారం ధరలు భారీగా మార్పులు చోటు చేసుకోవటం ఖాయమన్న మాట మార్కెట్ వర్గాల నుంచి వినిపిస్తోంది.
Tags:    

Similar News