ట్రంకు పెట్టెల్లో బంగారం..వెండితో పాటు బైకులు..గుర్రాలు

Update: 2020-08-20 05:15 GMT
ఒక సాదాసీదా డ్రైవర్ ఇంట్లో ఎనిమిది ట్రంకు పెట్టెల్లో లభించిన.. బంగారు.. వెండి ఆభరణాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన వైనం తెలిసిందే. ఒక వివాదంలో రెండు నాటు తుపాకీలతో బెదిరించిన ఉదంతం గురించి సమాచారం అందుకున్న అనంత పోలీసులు తీగ లాగితే.. ఊహించని రీతిలో ఒక పెద్ద అవినీతి అనకొండ డొంక కదిలింది. ఆ డ్రైవర్ వెనుక ఉన్నది.. అనంతపురంలోని జిల్లా ట్రెజరీ కార్యాలయంలోని సీనియర్ అకౌటెంట్ గాజుల మనోజ్ కుమార్ గా తేలింది.

ఇతగాడు కూడబెట్టిన ఆస్తి రూ.3కోట్ల మేర ఉంటుందని తేల్చారు. 2.42 కేజీల బంగారంతో పాటు.. 84 కేజీల వెండి.. రూ.15.5 లక్షల క్యాష్.. రూ.49.1లక్షల ఫిక్సెడ్ డిపాజిట్లను గుర్తించారు. ఇక్కడితో లెక్క అయిపోలేదని.. ఈ అవినీతి అనకొండలో మరో యాంగిల్ ను కూడా పోలీసులు బయటకు తీసుకొచ్చారు.  ఇతగాడి వద్ద మూడు డమ్మీ పిస్తోళ్లు.. పద్దెనిమిది రౌండ్ల బుల్లెట్లు లభించాయి. మరో ఎయిర్ పిస్తోలును కూడా పోలీసులు గుర్తించారు.

ఎనిమిది ట్రంకు పెట్టెల్లో లభించిన బంగారం.. వెండి.. భారీ క్యాష్ మాత్రమే కాదు.. మనోజ్ ది అతి విలాసవంతమైన జీవితంగా చెబుతున్నారు. అతడుతరచూ అనంత నుంచి బెంగళూరుకు విలాసవంతమైన బైకుల్ని వినియోగించే వారిని చెబుతున్నారు. అతగాడి వద్ద ఉన్న బైకు ఏకంగా రూ.13 నుంచి 15లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు.. రూ.7లక్షల విలువ చేసే మూడు రాయల్ ఎన్ ఫీల్డ్ బైకులు.. రెండు కరిజ్మా బైకులతో పాటు.. మరో రెండు మహీంద్రా కార్లు.. హోండా యాక్టివాలు ఉన్నట్లు గుర్తించారు. వీటితో పాటు.. గుర్రాల్ని కూడా పెంచుతున్నట్లుగా తేల్చారు. ఇందుకోసం వ్యవసాయ క్షేత్రాన్ని లీజుకు తీసుకున్నాడు. ఇందులో పనుల కోసం నాలుగు ట్రాక్టర్లను కూడా కొనుగోలు చేయటం చూస్తే.. ఇతగాడి ప్లానింగ్ మామూలుగా లేదన్న భావన కలుగక మానదు.
Tags:    

Similar News