అమరావతిలో ఐకానిక్ బ్రిడ్జిలు, గోల్ఫ్ కోర్సులు

Update: 2015-12-28 22:30 GMT
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని పర్యాటక నగరంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందులో భాగంగా కృష్ణా నది అభిముఖ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయనున్నారు. ఫైవ్ స్టార్ హోటళ్లు, రిసార్ట్స్, వినోద కేంద్రాలు, పార్కులను ఏర్పాటుచేస్తారు. అంతర్జాతీయ స్థాయిలో ఐకానిక్ బ్రిడ్జిలు, అమరావతి గేట్ వే వంతెనలువంటి కట్టడాలతో అమరావతిని ఆకర్షణీయంగాతీర్చి దిద్దాలని భావిస్తున్నారు. ఈ మేరకు మాస్టర్ ప్లాన్ లో పేర్కొన్నారు.

వినోదం కోసం 380 ఎకరాల్లో మూడు గోల్ఫ్ కోర్సులను, 510 ఎకరాల్లో అత్యాధునిక యూనివర్సిటీ, దానికి చేరువలో సెంట్రల్ పార్కు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కృష్ణా నదికి అభిముఖంగా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించనున్నారు. దేశంలోనే హైస్పీడ్, మెట్రో, సబర్బన్ కలిపి రాజధాని ప్రాంతంలో 112 కిలోమీటర్ల మెట్రో సర్క్యూట్ ను ఏర్పాటు చేస్తారు. కృష్ణా నదిలోని దీవులను కలుపుతూ మిరుమిట్లు గొలిపే ఐకానిక్ బ్రిడ్జిలు, నదికి అభిముకంగా సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, ప్రభుత్వ కార్యాలయాలు తదితరాలన్నీ ఒకేచోట ఉండేలా మాస్టర్ ప్లాన్ లో పేర్కొన్నారు.

వినోద కేంద్రాలు - క్రీడా ప్రాంగణాలు - పార్కులు - బ్యాంకులు తదితరాలన్నీ ఒకదానికొకటి చేరువలో ఉండడం వల్ల పర్యాటకంతోపాటు వ్యాపార అనుకూల నగరంగా అమరావతి మారుతుందని నిపుణులు వివరిస్తున్నారు. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించేలా అమరావతి, ఇంద్ర కీలాద్రి మధ్య ఉన్న పవిత్ర పుణ్య క్షేత్రాలను చారిత్రక కట్టడాలను కలుపుతూ ఒక సర్క్యూట్ ను మాస్టర్ ప్లాన్ లో పేర్కొన్నారు.


Tags:    

Similar News