విదేశీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కొవాగ్జిన్ కు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్

Update: 2021-11-02 04:30 GMT
కరోనా కారణంగా విదేశీ ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. ఇతర దేశాలకు వెళ్లాలనుకున్న విద్యార్థులు, ఉద్యోగులకు ఈ మహమ్మారి ఏడాదిన్నర కాలం నుంచి పెద్ద తలనొప్పిగా మారింది. వారు సూచించిన టీకా తీసుకుంటేనే తమ దేశంలోకి అనుమతిస్తామని కొన్ని దేశాలు ఆంక్షలు విధించాయి. ఇందులో భాగంగానే ఆస్ట్రేలియా కొవిషీల్డ్ కు అనుమతిని ఇదివరకే ఇచ్చింది. ఈ వ్యాక్సిన్ ను రెండు డోసులు తీసుకుంటేనే తమ దేశంలో అడుగు పెట్టే ఛాన్స్ ఉండేది. అయితే తాజాగా కొవాగ్జిన్ కు కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. భారతదేశానికి చెంది భారత్ బయోటెక్ సంస్థ, ఐసీఎంఆర్ కలిసి అభివృద్ధి చేసిన టీకా కొవాగ్జిన్ ను ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది.

కొవాగ్జిన్ రెండు డోసులు తీసుకున్న వారికి ఆస్ట్రేలియాకు వెళ్లే అనుమతి ఇచ్చింది. 12 ఏళ్లు పైబడిన వారు ఈ టీకా రెండు మోతాదులు తీసుకుంటే తమ దేశంలోకి రావొచ్చని ఆస్ట్రేలియా ఫార్మా రెగ్యులేటర్-థెరప్యూటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్(టీజీఏ) అధికారికంగా ప్రకటించింది. ఈ టీకాతో పాటు చైనా బీబీఐబీపీ-కోర్ వి కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విదేశీ ప్రయాణికుల వ్యాక్సిన్ స్టేటస్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఇకపోతే అస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ కు ఇదివరకే అనుమతులు లభించాయి.


కరోనా వ్యాప్తిని తగ్గించే అత్యంత ప్రభావవంతమైన వ్యాక్సిన్ల అదనపు సమాచారాన్ని టీజీఏ ఇటీవలె సేకరించింది. వాటిపై అధ్యయనం చేసిన తర్వాతే ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపోతే 12 ఏళ్లు పైబడి కొవాగ్జిన్ రెండు డోసులు తీసుకున్న వారు, 18-60 మధ్య ఉండి బీబీఐబీపీ-కోర్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఆస్ట్రేలియాలోకి అనుమతి ఉందని వెల్లడించింది. దీంతో ఆ దేశానికి వెళ్లాలనుకున్న విద్యార్థులకు కాస్త ఊరట లభించింది. అయితే టీజీఏ అనుమత్చిన టీకాలు తీసుకోకపోయినా లేదా అసలు వ్యాక్సినే తీసుకోకుండా ఆ దేశంలో అడుగు పెట్టాలంటే కొన్ని షరతులు వర్తిస్తాయి. ఎలా అంటే వ్యాక్సిన్ తీసుకోకపోతే క్వారంటైన్ నిబంధనలను తప్పకుండా పాటించాలి. ఇకపోతే ప్రయాణానికి ముందు కరోనా నెగెటివ్ రిపోర్టును చూపించాల్సి ఉంటుంది. ఇక ఈ రెండు టీకాలకు అధికారిక గుర్తింపుతో చాలామందికి ఉపశమనం కలిగిందని చెప్పవచ్చు.

భారత్ కు చెందిన కొవాగ్జిన్ కు ఆస్ట్రేలియా గుర్తింపు దక్కడం నిజానికి మంచి పరిణామమే. ఈ వ్యాక్సిన్ ను ఇప్పటికే భారత్ సహా చాలా దేశాల్లో ఉపయోగిస్తున్నారు. వివిధ దేశాల్లోని ప్రజలు కూడా కొవాగ్జిన్ తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనికి మరో అయిదు దేశాలు కూడా అధికారికంగా గుర్తించాయి. పాలెస్తినా, మౌరిషస్, కిర్గిస్థాన్, మగోలియా, ఈస్టోనియా దేశాలు ఈ టీకాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని అధికారికంగా గుర్తించాల్సి ఉంది. అయితే అతి త్వరలోనే ఇది కూడా జరుగుతుందని తెలుస్తోంది. కొవాగ్జిన్ టీకాను ఆస్ట్రేలియా ట్రావెలర్స్ వ్యాక్సినేషన్ స్టేటస్ లో గుర్తించడం పట్ల భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.





Tags:    

Similar News