భారతీయులకు గుడ్ న్యూస్.. బ్రిటన్లో కొత్త పథకం..!

Update: 2023-01-19 02:30 GMT
భారత్ కు చెందిన వృత్తి నిపుణులు బ్రిటన్లో రెండేళ్లు నివాసం ఉండేలా అక్కడి ప్రభుత్వం కొత్త స్కీమ్ ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి 28 నుంచి ఈ పథకం అమల్లోకి రానుందని బ్రిటన్ తాజాగా ప్రకటించింది. యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ (వైపీఎస్) పేరుతో బ్రిటన్.. భారత్ సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేయనుండటం గమనార్హం.

వైపీఎస్ పథకంలో భాగంగా బ్రిటన్ కు చెందిన వృత్తి నిపుణులు మన దేశంలో ఉండేందుకు.. పని చేసేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మన దేశానికి చెందిన 18 నుంచి 30 ఏళ్ళ మధ్య వయస్సు కలిగిన వృత్తి నిపుణులు బ్రిటన్లో రెండేళ్ల పాటు నివాసం ఉండేందుకు అవకాశం కలుగుతుంది. పరస్పర అంగీకారంతో యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ ను రెండు దేశాలు అమలు చేయనున్నాయి.

కరోనా పరిస్థితులు.. ఇతర నిబంధనల కారణంగా ఈ అవకాశం కొంతమందికి మాత్రమే దక్కనుంది. ఈ స్కీమ్ లో భాగంగా 3వేల మంది గ్రాడ్యుయేట్స్ యూకేలో రెండేళ్లు నివసించేందుకు ఉద్యోగాలు చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది. ఇందుకు స్పాన్సర్ లేదా చేతిలో ఉద్యోగం అవసరం లేదు. జపాన్ మినహా ఈ పథకం కలిగిన ఏకైక దేశంగా భారత్ నిలవడం విశేషం.

మరోవైపు భారత్ బ్రిటన్ మధ్య యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ కోసం వీసా నిబంధనలు సడలించారు. దీంతో ఇప్పటికే ఈ హోదా అనుభవిస్తున్న ఆస్ట్రేలియా.. కెనడా.. న్యూజిలాండ్.. జపాన్.. తైవాన్.. ఐస్‌లాండ్.. శాన్ మారినో.. మొనాకో.. దక్షిణ కొరియా.. హాంకాంగ్ వంటి కొన్ని దేశాల సరసన భారత్ చేరింది.

ఈ స్కీమ్ కోసం అభ్యర్థులను బ్యాలెట్ విధానంలో ఎంపిక చేయనున్నారు. యూకే యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ రెండు పద్ధతుల్లో పని చేస్తుంది. ఆస్ట్రేలియా నుంచి 30 వేల మంది.. కెనడా నుంచి 6 వేల మంది.. మొనాకో నుంచి వెయ్యి.. న్యూజిలాండ్ నుంచి 13వేల మంది.. శాన్ మారినో నుంచి వెయ్యి మంది.. ఐస్‌లాండ్ నుంచి వెయ్యి మంది నేరుగా వీసా దరఖాస్తు చేసుకునే అవకాశముంది.

అలాగే జపాన్ నుంచి 1500 మంది.. దక్షిణ కొరియా నుంచి వెయ్యి.. హాంకాంగ్ నుంచి వెయ్యి..  తైవాన్ నుంచి వెయ్యి.. ఇండియా నుంచి 3 వేల మందిని బ్యాలెట్ విధానంలో ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతానికి భారతదేశానికి సంబంధించిన నిర్దిష్ట వివరాలను వెల్లడించలేదు. జపాన్.. దక్షిణ కొరియా.. హాంకాంగ్.. తైవాన్ మాదిరిగానే భారత్ విషయంలో బ్రిటన్ అనుసరించే అవకాశముంది.

యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ కోసం భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలోనే 3వేల మందికి అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తులు జనవరి.. జూలై నెలల్లో సంవత్సరానికి రెండు సార్లు ఈమెయిల్ ద్వారా బ్యాలెట్ లోకి ఎంటర్ కావచ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News