టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కు భారీ ఊరట

Update: 2021-03-12 12:30 GMT
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు రవిప్రకాస్ కు ఇచ్చిన ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని ఈడీ దాఖలు చేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది.

తెలంగాణ హైకోర్టు కొద్ది నెలల క్రితమే ఇచ్చిన ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని ఈడీ కోరగా.. అందుకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు. బెయిల్ నిబంధనలను రవిప్రకాష్ ఏమైనా ఉల్లంఘించారా? అని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. అన్నీ పరిశీలించిన తర్వాత ముందస్తు బెయిల్ ను మంజూరు చేసిందని ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో ఈడీ దాఖలు చేసిన పిటీషన్ ను కొట్టివేస్తున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది.

టీవీ9 సంస్థ నుండి నిధులను స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలతో రవి ప్రకాష్‌పై మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద ఈడి అధికారులు  కేసు నమోదు చేశారు. ఈ కేసును రవి ప్రకాష్ సవాలు చేసి ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.

బోనస్ పేరిట అనధికారికంగా టీవీ9 సంస్థ  నుండి రూ .18 కోట్లు డ్రా చేసినట్లు ఆ కంపెనీ యాజమాన్యం 2019 అక్టోబర్‌లో ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఈడి ఈ కేసును దాఖలు చేసింది. దీనికి సంబంధించి బంజారా హిల్స్ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి రవి ప్రకాష్‌ను అరెస్టు చేశారు. సెప్టెంబరు 2018 - మే 2019 మధ్య మరో ఇద్దరు సంస్థ నుండి మోసపూరితంగా డబ్బును ఉపసంహరించుకున్నారని కంపెనీ ఆరోపించింది.

ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా.. ఈడి కూడా కేసు నమోదు చేసింది. హైకోర్టు బెయిల్ నేపథ్యంలో  ఈడీ సుప్రీంకోర్టుకు వెళ్లగా అక్కడా ఎదురుదెబ్బ తగిలింది. రవిప్రకాష్ కు ఊరట లభించింది. గత నెలలోనే రవిప్రకాష్ తనకు పాస్ పోర్టు ఇప్పించాలని.. టీవీ9 కార్యాలయంలో తన విలువైన పత్రాలు, పాస్ పోర్టులు ఉన్నాయని.. కొంత నగదు తన క్యాబిన్ లో ఉండిపోయిందని.. మూడు వేర్వేరు పిటీషన్లను హైకోర్టులో దాఖలు చేశారు.
Tags:    

Similar News