హుజూరాబాద్ కు రాజయోగం

Update: 2021-08-24 17:30 GMT
ఈటల రాజేందర్ ఏ ముహూర్తాన హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడో కానీ.. ఇప్పుడు అక్కడి ప్రజలకు, నేతలకు రాజయోగం పట్టేసింది. ప్రజలకు దళితబంధు సహా పలు పథకాల పేరిట వరాలు కురుస్తున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన నాయకులకు వరుసగా పదవుల పంట పండుతోంది.

హుజూరాబాద్ కాంగ్రెస్ లో నుంచి టీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డికి ఏకంగా సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఎమ్మెల్యే టికెట్ తో మొదలు ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల్లో కూడా ఇప్పుడు రాష్ట్రంలో హుజూరాబాద్ హవా కొనసాగుతోంది.

ఓవైపు హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక  నిధులు , దళితబంధు పథకం ఇలా అక్కడి ప్రజలకు ఉపయోగపడే అనేక సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చురుకుగా సాగుతున్నాయి.  ప్రజలకే కాకుండా టీఆర్ఎస్ నేతలను నామినేటెడ్ పోస్టులు ఎక్కువగా వరిస్తున్నాయి.

హుజూరాబాద్ లోకల్ తోపాటు హుజూరాబాద్ పరిసర నియోజకవర్గ నాయకులకు కూడా నామినేటెడ్ పదవులు వరిస్తుండడంతో ఇప్పుడు అక్కడి నాయకులు పుల్ జోష్ లో ఉన్నారట..

హుజూరాబాద్ లో ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ అధిష్టానం ఇక్కడి నాయకులకు నామినేటెడ్ పదవులు ఇస్తూ కొత్త ఉత్సాహం నింపుతోంది. గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతోపా మిగతా ఆశావహులకు కూడా నామినేటెడ్ పదవులు కేటాయిస్తూ అసంతృప్తి జ్వాలలను చల్లార్చుతున్నారని సమాచారం.

ఇప్పటికే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా బండ శ్రీనివాస్, బీసీ కమిషన్  చైర్మన్ గా తాజాగా వకుళాభరణం కృష్ణ మోహన్ ను నియమిస్తూ కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈక హుజూరాబాద్ పక్క నియోజకవర్గం మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్మన్ గా పదవులు ఇచ్చారు. ఇక ఇన్నాళ్లు ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న ఈటల రాజేందర్ స్థానంలో మంత్రి హరీష్ రావును అధ్యక్షుడిగా చేశారు.

దీంతో ఎన్నిక నోటిఫికేషన్ వచ్చే లోపు హుజూరాబాద్ తోపాటు సమీప నియోజకవర్గ నేతలకు మరిన్ని పదవులు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది. నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక నిధులు, నేతలకు పదవుల వరదతో హుజూరాబాద్ లో పార్టీ విజయాన్ిన ఖాయం చేసుకోవాలన్నది టీఆర్ఎస్ పెద్దల వ్యూహంగా కనిపిస్తోంది.
Tags:    

Similar News