వారి ఆగ్రహంతో దిగి వచ్చిన ట్రంప్ సర్కార్

Update: 2020-07-15 08:45 GMT
కీలక స్థానాల్లో ఉండే కొందరు ఎప్పుడేం మాట్లాడతారో అర్థంకాని రీతిలో ఉంటే ఎలాంటి పరిస్థితి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరించే అమెరికా లాంటి దేశానికి అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి ఎలా ఉండాలి? తాను ప్రకటించే నిర్ణయాలకు సంబంధించి ఎంత కసరత్తు జరగాలి? కానీ.. అదేమీ లేకుండా మనసుకు తోచినట్లుగా మాట్లాడి వివాదాల్లో కూరుకుపోవటం.. విమర్శల పాలు కావటం ట్రంప్ కు మొదట్నించి అలవాటే.

ఈ మధ్యనే అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థుల నెత్తిన పిడుగుపడేలా ఒక నిర్ణయాన్ని ప్రకటించారు ట్రంప్. కరోనా నేపథ్యంలో ఆన్ లైన్ క్లాసుల్ని ఎంపిక చేసుకున్న విద్యార్థులు అమెరికా నుంచి వారి దేశాలకు వెళ్లిపోవాలంటూ షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. పలు వర్సిటీ యాజమాన్యాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటంతో పాటు.. ఈ వివాదాస్పద నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్న ఒత్తిడిని తీసుకొచ్చాయి.

ఇవి సరిపోనట్లు.. వర్సిటీలు న్యాయపోరాటం దిశగా అడుగులు వేయటం ట్రంప్ సర్కారుకు షాకింగ్ గా మారింది. వర్సిటీలకు తోడుగా కార్పొరేట్లు రంగంలోకి దిగారు. ట్రంప్ సర్కారు తీరును హార్వర్డ్.. మసాచుసెట్స్ ఆఫ్ టెక్నాలజీస్ తో పాటు.. ఐటీ సంస్థలైన గూగుల్.. ఫేస్ బుక్.. మైక్రోసాఫ్ట్.. కొలంబియాతో పాటు మరో 17 రాష్ట్రాలు ట్రంప్ సర్కారు నిర్ణయాన్ని తప్పు పడుతూ కోర్టును ఆశ్రయించాయి.  

దీంతో దిద్దుబాటు చర్యలకు తెర తీశారు ట్రంప్. ఆన్ లైన్ క్లాసుల్ని ఎంపిక చేసుకునే విద్యార్థులు తమ స్వదేశాలకు వెళ్లిపోవాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు ఫెడరల్ న్యాయమూర్తి అల్లీసన్ బురోగ్స్ ప్రకటించారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్ని కోర్టు నిలిపివేయాలని కోరిన వేళ.. ప్రభుత్వమే ఒక అడుగు ముందుకేసి.. వివాదాన్ని ముగిసేలా నిర్ణయం తీసుకోవటంతో ఈ వివాదం ఒక కొలిక్కి వచ్చినట్లుగా చెప్పాలి. అయినా.. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. అందరి చేత వేలెత్తి చూపేలా నిర్ణయాలు తీసుకోవటంలో ట్రంప్ సర్కారు తర్వాతే ఎవరైనా.
Tags:    

Similar News