అలాంట‌ప్పుడు గూగుల్ ను వ‌దిలేస్తే స‌రి!

Update: 2018-03-05 05:17 GMT
ఎప్పుడు ఎవ‌రి మీదా ఎక్కువ కాలం ఆధార‌ప‌డ‌కూడ‌ద‌ని చెబుతుంటారు.  మొద‌ట ముద్దుగా చూసుకున్నా.. కొన్నాళ్ల త‌ర్వాత మ‌నం త‌ప్ప మ‌రెవ‌రూ దిక్కు లేద‌న్న భావ‌న వ‌చ్చిన క్ష‌ణం నుంచి అస‌లు రంగు బ‌య‌ట‌ప‌డుతుంది. అన్ని ఫ్రీ.. అన్న‌ట్లుగా మొత్తం స‌మాచారాన్ని.. ఫోటోల్ని.. వీడియోల‌ను అందించిన గూగుల్ పుణ్య‌మా అని అదే ప్ర‌పంచంగా మారింది.

ఈ రోజున ఉన్న‌ట్లుండి గూగుల్ లేకుండా జీవితం ఏమిటి? అన్న సందేహం వ‌చ్చినంత‌నే వ‌ణికిపోయే ప‌రిస్థితి. గూగుల్ కాకుండా గూగుల్‌ కు పెద్ద‌నాన్న లాంటి యాహు ఉంద‌ని.. రెడీప్‌.. బాబాయ్ లాంటి బింగ్ ఉంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోయిన ప‌రిస్థితి.

ఎందుకిలా అంటే.. అవ‌స‌రానికి మించి గూగుల్ మీద ఆధార‌ప‌డిపోవ‌ట‌మే. తాను త‌ప్పించి మ‌రో సెర్చ్ ఇంజిన్ లేన‌ట్లు భావ‌న గూగుల్ నెత్తికి ఇప్ప‌డిప్పుడే ఎక్కుతున్న‌ట్లుగా ఉంది. దీంతో.. ఫ్రీ కాస్తా.. పే స‌ర్వీసుల్ని తీసుకొచ్చేసింది. అంతేనా.. ఫిబ్ర‌వ‌రి రెండో వారం.. క‌చ్ఛితంగా చెప్పాలంటే ఫిబ్ర‌వ‌రి 14 నుంచి కొత్త రూల్ ను తెచ్చేసింది.

ఇప్ప‌టివ‌ర‌కూ ఏదైనా ఫోటో కావాలంటే.. గూగుల్ సెర్చ్ లోకి వెళ్లి కొట్టేయ‌టం.. ఫోటో వ‌చ్చినంత‌నే దాన్ని కాపీ చేసుకోవ‌టం.. లేదంటే డౌన్ లోడ్ చేసుకునే ప‌రిస్థితి. ఏ సైజులో అయినా.. ఏ రెజుల్యూష‌న్ లో అయినా స‌రే ఫోటోల్ని తీసేసుకోవ‌టం ఏళ్ల‌కు ఏళ్లుగా న‌డుస్తున్న అల‌వాటు.

గూగుల్ సెర్చ్ లోనే గూగుల్ ఇమేజ‌స్ కు ఏకంగా ఒక విభాగాన్నే ఏర్పాటు చేయ‌టం మ‌ర్చిపోకూడ‌దు.కానీ.. ఇప్పుడు గూగుల్ రూల్స్ మార్చేసింది. ఇమేజ‌స్ లో వ‌చ్చిన ఫోటోను సేవ్ చేసుకునే సౌక‌ర్యంతో పాటు.. డౌన్ లోడ్ చేసుకునే అవ‌కాశాన్ని క్లోజ్ చేసేశారు. ఎందుకిలా అంటే కాపీరైట్ అనే తిరుగులేని మాట‌ను చెప్పేస్తోంది.

ఇమేజ‌స్ విష‌యంలో మీడియా సంస్థ‌ల‌కు..ఫోటో కంటెంట్ అవ‌స‌రాల్ని తీర్చే మొన‌గాడు లాంటి గెట్టి ఇమేజ‌స్ తో గూగుల్ చేసుకున్న ఒప్పందంతో.. కాపీ చేసుకునే..డౌన్ లోడ్ చేసుకునే అవ‌కాశాన్ని బంద్ చేసేశారు. దీంతో.. నెటిజ‌న్లు ఫోటోల్ని కాపీ చేయాలంటే చేసుకోలేని ప‌రిస్థితి నెల‌కొంది.

ఈ అంశం మీద త‌గినంత ప్ర‌చారం చేయ‌క‌పోవటం.. అవ‌గాహ‌న లేక‌పోవ‌టంతో ఏం చేయాలో తోచ‌క కంగారు ఎత్తిపోయే ప‌రిస్థితి. ఇప్పుడున్న విధానంలో ఫోటో కావాలంటే.. స‌ద‌రు వెబ్ సైట్లోకి వెళ్లి సేవ్ చేసుకోవాలి. దీని కార‌ణంగా అనుకున్న సైజ్ ల‌భించ‌క‌పోవ‌టంతో పాటు. వెట్ సైట్లోకి వెళ్లి రావ‌టం వ‌ల్ల టైం టేకింగ్ కూడా ఉంటుంద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. మ‌రి ఈ ఇబ్బందిని ఎలా అధిగ‌మించాల‌న్న‌ది ఈ మ‌ధ్య కాలంలో ప‌లువురికి పెద్ద స‌మ‌స్య‌గా మారింది. దీనికి ప‌రిష్కారంగా యాహు.. బింగ్ సెర్చింజ‌న్ సేవ‌ల్ని వినియోగిస్తే స‌రిపోతుంద‌ని చెబుతున్నారు. గూగుల్ తో ఏళ్ల‌కు ఏళ్లుగా అనుబంధం ఉన్న కార‌ణంగా ఇప్ప‌టికిప్పుడు వ‌దిలేయ‌టం క‌ష్ట‌మే అయినా.. అవ‌స‌రానికి త‌గ్గ‌ట్లుగా మారిపోతే స‌రిపోతుంది.
Tags:    

Similar News