గూగుల్ తాజా సంచలనం.. ఆ చిప్ ఎంత అద్భుతమంటే?

Update: 2019-10-24 04:54 GMT
ఊహించలేని అద్భుతాన్ని ఆవిష్కరించింది గూగుల్.  కంప్యూటర్ రంగంలో సరికొత్త అధ్యాయానికి తెర తీసిన గూగుల్.. తన తాజా ఆవిష్కరణతో యావత్ ప్రపంచం ఒక్కసారిగా తన వైపు చూసేలా చేసింది. అనూహ్య వేగంతో లెక్కించే అద్భుతమైన చిప్ ను తాజాగా ఆవిష్కరించింది.

వాస్తవానికి ఈ అద్భుతమైన ఆవిష్కరణకు సంబంధించిన కొన్ని వివరాలు సెప్టెంబరు నెలలో వచ్చినప్పటికీ.. పూర్తి వివరాల్నిగూగుల్ తాజాగా వెల్లడించింది. ఇంతకీ.. గూగుల్ ఆవిష్కరించిన ఈ అద్భుతం ఏమంటే.. సూపర్ కంప్యూటర్లను మించిన వేగంతో పని చేసే అత్యాధునిక చిప్ (దీన్ని సికమోర్ పేరుతో వ్యవహరిస్తున్నారు) ను డెవలప్ చేసింది.

దీనితో కలిగే లాభం ఏమంటే అత్యంత వేగంగా పని చేసే సూపర్ కంప్యూటర్ 10వేల ఏళ్లలో పూర్తి చేసే గణను ఈ తాజా చిప్ కేవలం 200 సెకన్లు(మూడున్నర నిమిషాల్లో) పూర్తి చేస్తుందని గూగుల్ సగర్వంగా వెల్లడించింది. తాజా ఆవిష్కరణను క్వాంటమ్ సుప్రిమసీగా అభివర్ణించింది. ఒక ప్రముఖ సైన్స్ జర్నల్ ద్వారా ఈ వివరాలు బయటకు వచ్చాయి.

సాధారణ కంప్యూటర్లు బైనరీ సంఖ్యల ఆధారంగా డేటాను లెక్కిస్తే.. ఈ సికమోర్ చిప్ బైనరీ సంఖ్యతో పాటు 54- క్యూబిట్స్ తో కూడిన క్వాంటమ్ ప్రాసెసర్ ఆధారంగా అద్భుతంగా పని చేస్తుంటుంది. ఈ చిప్ లోని ప్రతి క్యూబిట్ మరో నాలుగు క్యూబిట్ లతో అనుసంధానమై ఉంటుంది. దీంతో లెక్క వాయు వేగంతో సాగుతుంది. తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాస్త్రవేత్తలు తయారు చేసిన క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ పై గూగుల్ సీఈవో సుందర్ పిచాయి సంతోషాన్ని వ్యక్తం చేయటమే కాదు.. తనకీ ఆవిష్కరణ గర్వంగా ఉందన్నారు.

ఇదో భారీ ముందడుగు అని.. దశాబ్దానికి పైగా చేసిన ప్రయత్నంతో దీన్ని తాము సాధించినట్లు పేర్కొన్నారు. ఈ రీసెర్చ్ లో పాల్గొన్న వారందరికి థ్యాంక్స్ చెప్పిన పిచాయ్ యమా సంతోషంగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిప్ మీద ప్రఖ్యాత కంప్యూటింగ్ రంగంలో పరిశోధనలు చేసే ఐబీఎం కొన్ని అనుమానాల్ని వ్యక్తం చేసింది. చిప్ పని తీరును మరీ ఎక్కువ చేసి ప్రచారం చేసుకుంటున్నారన్న భావనను వ్యక్తం చేసింది. సికమోర్ 200 సెకన్లలో పూర్తి చేసే పనిని సంప్రదాయ కంప్యూటర్లు సైతం రెండున్నరేళ్లలో పూర్తి చేయగలదని పేర్కొన్నారు. కాస్త ఎక్కువ చేసి చెప్పి ఉండొచ్చు.. కానీ.. అది కూడా గొప్పేగా అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Tags:    

Similar News