భారత్ కు మళ్లీ గూగుల్ స్ట్రీట్ వ్యూ.. తొలుత గార్డెన్ సిటీ.. అదెలానంటే?

Update: 2022-07-28 03:59 GMT
ఇంట్లో కూర్చొని మనం కోరుకున్న ప్రాంతాల్లోని వీధుల్ని చూసే స్ట్రీట్ వ్యూ.. సేవల్ని భారత్ కు మళ్లీ తీసుకొచ్చేస్తోంది గూగుల్. ప్రఖ్యాత సెర్చింజన్ గా సుపరిచితమైన గూగుల్.. ఈ సేవల్ని గతంలో అందుబాటులోకి తీసుకొచ్చినా.. ఆ తర్వాత రక్షణ శాఖ అభ్యంతరాలతో ఈ స్ట్రీట్ వ్యూపై బ్యాన్ విధించారు.

2011లోనే స్ట్రీట్ వ్యూ ఫీచర్ ను గూగుల్ భారత్ లో ప్రవేశ పెట్టినా.. దీనిపై పలు అభ్యంతరాలు.. అనుమానాల నేపథ్యంలో దీనిపై 2016లో నిషేధం విధించారు. అప్పుడు బ్యాన్ పెట్టి.. ఇప్పుడు అనుమతి ఎలా ఇస్తారన్న సందేహానికి సమాధానంగా.. ప్రభుత్వ.. రక్షణ.. మిలిటరీ సంబంధిత ప్రాంతాల్లో స్ట్రీట్ వ్యూ అందుబాటులో ఉండదని చెబుతున్నారు.

తాజాగా ఈ స్ట్రీట్ వ్యూ ఫీచర్ ను త్వరలో భారత్ లో షురూ చేయనున్నారు. ఇందులో భాగంగా మొదట గార్డెన్ సిటీగా పేరున్న బెంగళూరులో తాజాగా ఈ సేవల్ని షురూ చేశారు. ప్రాజెక్టు గల్లీ పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టును  తర్వాతి కాలంలో హైదరాబాద్.. కోల్ కతా.. వడోదర.. అహ్మద్ నగర్.. అమ్రత్ సర్.. చెన్నై.. ఢిల్లీ.. ముంబయి.. ఫుణె నగరాల్లోకి అందుబాటులోకి తేనున్నారు. ఈ ఏడాది చివరి నాటికి యాభై నగరాల్లో అందుబాటులోకి రానుంది.

గూగుల్ మ్యాప్స్ ను మరింత సులభతరం చేయటంతో పాటు.. షాపింగ్ లో సరికొత్త ఒరవడి కోసం స్ట్రీట్ వ్యూ సాయం చేస్తుందని చెబుతున్నారు. ఈ ఫీచర్ ను మరింత ప్రభావవంతంగా వినియోగించుకోవటానికి వీలుగా.. ప్రభుత్వాలు.. స్థానిక కంపెనీలతో గూగుల్ పని చేస్తుందని ఆ సంస్థ చెబుతోంది.

రెండేళ్ల వ్యవధిలో దాదాపు 7 లక్షల కిలోమీటర్ల రోడ్లను మ్యాపింగ్ చేస్తారు. ఈ స్ట్రీట్ వ్యూను ఉపయోగించాలంటే..మనం వెళ్లాలనుకున్న ప్రాంతాన్ని గూగుల్ మ్యాప్స్ లో వెతకాలి. దీంతో.. ఆ ప్రాంతంలోని రోడ్లు.. పరిసరాలు కనిపిస్తాయి.

360 డిగ్రీల పనోరమా షాట్ లో అక్కడి వ్యూ తెలుస్తుంది. రోడ్లను జూమ్ చేస్తూ వెళ్లాలనుకున్న ప్రాంతాల్లోకి వెళ్లొచ్చు. అంతేకాదు.. హోటళ్లు.. షాపింగ్ మాల్స్ అయితే.. లోపలకు వెళ్లి మరీ చూసే వీలుంది. ఈ సేవల్లో భాగంగా.. ఆయా ప్రాంతాల్లో వాహనాల్లో ప్రయాణించే వారు ఎంత వేగంతో వెళ్లే వీలుందన్న విషయాల్ని తెలియజేస్తుంది. అక్కడి రోడ్ల గురించి.. అక్కడ జరిగే ప్రమాదాల ఆధారంగా ఎంత వేగంతో ప్రయాణించే అవకాశం ఉందన్న విషయాల్ని వెల్లడిస్తారు. అంతేకాదు.. ఆయా ప్రాంతాల్లో గాలి నాణ్యతను కూడా తెలుసుకునే వెసులుబాటు కల్పిస్తారు.
Tags:    

Similar News