బుచ్చ‌య్య అంత‌రంగంలో తీర‌ని ఆవేద‌న‌.. బాబూ విన్నారా?

Update: 2021-10-11 08:06 GMT
టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి.. త‌న మ‌న‌సులోని బాధ‌ను క‌క్కేశారు. కొంత ఆవేద‌న‌, ఇంకొంత ఆక్రోశం.. క‌లిపి ఆయ‌న త‌న అంత‌రంగాన్ని ఆవిష్క‌రించా రు. తాజాగా ఓ మీడియా అధిప‌తి చేసిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన బుచ్చ‌య్య‌.. టీడీపీలో త‌న సేవ‌ల‌ను వివ‌రిస్తూనే.. త‌న‌కు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యం ల‌భించ‌డం లేద‌ని.. కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. పార్టీని తాను ఒక సైనికుడిలా ముందుకు న‌డిపిస్తున్నాన‌న్న బుచ్చ‌య్య‌.. దూర‌దృష్టి గ‌ల నేత‌గా.. తాను చేసిన‌.. ప‌నుల‌ను వివ‌రించారు. అయిన‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు నుంచి కానీ.. ఇత‌ర పార్టీ నేత‌ల నుంచి కానీ.. త‌న‌కు ఆశించిన విధంగా మ‌ద్ద‌తు ల‌భించ‌డం లేద‌ని చెప్పుకొచ్చారు.

అమ‌రావ‌తి రాజ‌ధాని ఆలోచ‌న నుంచి.. పోల‌వ‌రం ముంపు మండ‌లాల విలీనం వ‌ర‌కు కూడా త‌న పాత్ర‌ను ఆయ‌న వివ‌రించారు. ``అమరావతి రాజధాని విషయంలో ముందుగా స్పందించింది నేనే.  ఈ ప్రాంతంపై ఒక నోట్‌ తయారు చేసి ఇచ్చాను. ఆ ప్రాంతం అంతా తిరిగి ఉన్నంతలో ఇదే రాజధానిగా మంచిదని భావించి కిరణ్‌ కుమార్‌ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే ఆయన పీఎస్‌ అజేయ కల్లం రెడ్డికి అందించాను. అలాగే శివరామకృష్ణన్‌ కమిటికీ కూడా ఇచ్చాను. టీడీపీ గెలిచిన తర్వాత... రాజధాని నిర్ణయం జరగక ముందే చంద్రబాబుకు కూడా అదే నోట్‌ ఇచ్చాను. రాబోయే రోజుల్లో అమరావతి ప్రాంతం రాజధాని అవ్వొచ్చని అప్పుడే చెప్పాను`` అని బుచ్చ‌య్య వివ‌రించారు.

అదేస‌మ‌యంలో పోల‌వ‌రం విష‌యంపై కూడా నిర్మొహ‌మాటంగా త‌న అభిప్రాయం వెల్ల‌డించారు. ``పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలు ఏపీలో విలీనం చేయకుంటే చాలా నష్టం జరుగుతుందని  మాజీ ఈఎన్‌సీ సీతాపతిరావు ఇచ్చిన నోట్‌ తీసుకెళ్లి చంద్రబాబుకు ఇచ్చాను. దీంతో వెంటనే చంద్రబాబు, వెంకయ్య నాయుడు కలిసి మోదీ తొలి కేబినెట్‌లో ఆ ముంపు మండలాలు విలీనం ఆర్డినెన్స్‌కు ఆమోదం తెచ్చారు. కానీ నేనెప్పుడూ క్రెడిట్‌ కోసం చెప్పుకోలేదు`` అని బుచ్చ‌య్య చౌద‌రి చెప్పారు.

ఇక‌, పార్టీలో నెల‌కొన్ని అసంతృప్తుల‌ను కూడా బుచ్చ‌య్య బ‌య‌ట పెట్టారు. ముఖ్యంగా పార్టీలో కొత్త వారికి అవ‌కాశం ఇచ్చి..పాత‌వారిని ప‌క్క‌న పెట్ట‌డంపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ``2019లో ఎన్నికల తర్వాత జరిగిన తొలి మీటింగ్‌లోనే పార్టీలో బయటి వారికి పెద్దపీట వేశారని చెప్పాను. అలాగే, పార్టీలోని వారికి పదవులు ఇవ్వలేదని నా అభిప్రాయం. నాకు ఇచ్చిన డిప్యూటీ లీడర్‌ పదవీ వద్దు. ఒక బీసీ వ్యక్తికి ఆ పదవి ఇవ్వమని చెప్పాను. ఆదిరెడ్డి అప్పారావు నథింగ్‌. ఆయన పార్టీ మారి వచ్చారు. నన్ను ఓడించాలని పని చేశారు. ఆయన భార్యను మేయర్‌ చేసింది నేనే. ఇప్పుడు నన్నే రాజమండ్రి రావద్దని ఆయన కోరుకుంటున్నారు`` అని తూర్పు గోదావ‌రి రాజకీయంపైనా నిర్మొహ‌మాటంగా మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టారు.

అదేస‌మ‌యంలో టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌ను పార్టీ కీల‌క నేత‌గా అంగీక‌రిస్తూ నే.. ఇప్పుడే కాదంటూ.. గ‌త కొన్నాళ్లుగా గుస‌గుస‌గా ఉన్న వ్య‌వ‌హారాన్ని కూడా బుచ్చ‌య్య కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. ``లోకేశ్ చంద్రబాబు వార‌సుడు. ఇందులో ఏం అనుమానం లేదు. కాబట్టి ఆయన అభివృద్ధి కావాలని కోరుకుంటాం. 2024లో చంద్రబాబు పేరుతోనే జనంలోకి వెళ్లాలి. ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాలంటే చంద్రబాబే మళ్లీ రావాలి అన్న ఫీలింగ్‌ జనంలో ఉంది. ఆ ట్రాక్‌లోనే వెళ్లాలి. అలా కాకుండా కొంతమంది కుర్రాళ్లు(ప‌రోక్షంగా లోకేష్‌) చేసే పనులు పక్క దారి పట్టించేలా ఉన్నాయి`` అని చెప్పుకొచ్చారు.

ఇక‌, త‌న‌ను ప‌క్క‌న పెడుతున్నార‌న్న వాద‌న‌.. త‌న‌కు క‌నీసం గౌర‌వం కూడా లేద‌న్న విష‌యాన్ని కూడా బుచ్చ‌య్య వెల్ల‌డించారు. ``చంద్రబాబు, లోకేశ్‌కు నేను ఫోన్‌ చేశాను. నేను ఏ రోజు ఎవరినీ ఇది చేయండి అని అడగలేదు. అలాంటి నేను జిల్లాల్లో కమిటీల గురించి... పార్టీ గురించే మాట్లాడతాను. ఆ విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తే... అధికారంలో ఉన్నప్పుడు బిజీ. లేనప్పుడూ బిజీ! వినతిపత్రం ఇద్దామన్నా గడప దగ్గరే ఇచ్చి వెనక్కి తిరిగి రావాల్సిన పరిస్థితి.  పార్టీని కూడా పట్టించుకోకుండా వదిలేశారు`` అని బుచ్చ‌య్య తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఇలా మొత్తంగా బుచ్చ‌య్య ఈ ఇంట‌ర్వ్యూలో త‌న మ‌న‌సులో ఉన్న ఆవేద‌న‌, ఆక్రోశాన్ని నిష్క‌ర్ష‌గా వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News