ఎమ్మెల్సీ ఎన్నికల్లో గౌరు వెంకటరెడ్డి నామినేషన్?

Update: 2017-12-25 18:01 GMT
కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉండబోమని ప్రకటించిన వైసీపీ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కర్నూలుకు చెందిన ఆ పార్టీ కార్యకర్తలు పట్టుబడుతున్నారు. అసలు బరిలోనే దిగకపోతే కార్యకర్తల స్థైర్యం దెబ్బతింటుందన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నుంచి గౌరు వెంకటరెడ్డి మంగళవారం నామినేషన్ వేయడానికి రెడీ అవుతున్నారు. అయితే... అనంతపురంలో పాదయాత్రలో ఉన్న జగన్ ను కలిసి ఆయనతో ఓకే అనిపించుకున్నాకే నామినేషన్ వేస్తానని గౌరు అంటున్నారు.
    
నిజానికి అక్కడ ఇంతకుముందు ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చక్రపాణి రెడ్డి, గౌరు వెంకటరెడ్డి ఇద్దరూ పోటీకి విముఖత చూపడంతోనే పోటీ నుంచి తప్పుకోవాలని వైసీపీ నిర్ణయించింది. కానీ.. టీడీపీ క్యాండిడేట్ ఎవరన్నది తేలాక గౌరు వెంకటరెడ్డి పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. వెంకటరెడ్డి బంధువైన శివానందరెడ్డికి టీడీపీ టిక్కెట్ ఇస్తారని తొలత భావించడంతో వెంకటరెడ్డి పోటీకి వెనక్కు తగ్గారు. కానీ.. అక్కడ కేఈ ప్రభాకర్‌కు టిక్కెట్ ఇవ్వడంతో ఆయన మనసు మారడమే కాకుండా కార్యకర్తల నుంచి కూడా ఒత్తిడి పెరిగిందట. దీంతో ఆయన మంగళవారం జగన్ ను కలిసి ఆయన్ను ఒప్పించాలనుకుంటున్నట్లు సమాచారం.
    
మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సివచ్చినప్పుడు ఖర్చు పెట్టాలి కాబట్టి ఇప్పుడీ ఖర్చు ఎందుకు అన్న ధోరణితో వైసీపీ నేతలు ఎమ్మెల్సీ ఎన్నికలపై పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ... టీడీపీ కేఈ ప్రభాకర్ కు టిక్కెట్ ఇవ్వడంతో గౌరు వెంకటరెడ్డి రంగంలోకి దిగడానికి రెడీ అవుతున్నారు. మరి.. జగన్ ఏమంటారో చూడాలి.
Tags:    

Similar News