తెలంగాణ ఆగమాగంగా మారిన వేళ.. ఢిల్లీకి వెళ్లిన గవర్నర్ తమిళ సై

Update: 2022-08-25 04:32 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎప్పుడూ ఎదురుకాని విచిత్రమైన పరిస్థితి తాజాగా తెలంగాణలో నెలకొంది. ఒకవైపు గులాబీ బాస్ కేసీఆర్ కుమార్తెపై ఢిల్లీ లిక్కర్ స్కాంలో పాత్ర ఉందంటూ ఆరోపణలు.. మరోవైపు హైదరాబాద్ లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఐటీ దాడులు.. ఈ సంస్థలకు మంత్రికేటీఆర్ కు సంబంధాలు ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి.

ఇవి సరిపోనట్లుగా స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుఖీ హైదరాబాద్ కు వచ్చి షో చేయటం.. దానికి నిరసనగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఒక ఎత్తు అయితే.. గతంలో చెప్పిన రీతిలో ఆగస్టు 22న ప్రపంచం మొత్తం షాక్ తినేలా కామెడీ షో చేస్తానని ప్రకటించిన దానికి తగ్గట్లే.. తాజాగా ఆయన మహ్మద్ ప్రవక్త మీద వివాదాస్పద వ్యాఖ్యలతో కూడిన ఒక వీడియోను విడుదల చేయటం.. అది కాస్తా పెను వివాదంగా మారటం తెలిసిందే.

ఇది సరిపోనట్లు మునుగోడు ఉప ఎన్నిక. దానికి సంబంధించిన ఏర్పాట్లు.. కసరత్తు జోరుగా సాగుతున్న వేళ.. మరోవైపు టీబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేయటం.. శాంతిభద్రతల ఇష్యూను చూపించి.. దాన్ని అడ్డుకునేందుకు వీలుగా ఇప్పటికే బ్రేకులు వేయటం తెలిసిందే.

ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లింది. బుధవారం సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో గవర్నర్ తమిళ సై భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో జరుగుతున్న పరిణామాల గురించి కేంద్రానికి ఆమె పలు అంశాల్ని షేర్ చేసినట్లుగా చెబుతున్నారు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోనెలకొన్న పరిస్థితులు.. రాజకీయ..శాంతిభద్రతలకు సంబంధించిన అంశాల్ని చర్చించటంతో పాటు.. వీటికి సంబంధించిన ప్రత్యేక నివేదికను ఇస్తున్నారు. లిక్కర్ స్కాం ఆరోపణల నేపథ్యంలో బీజేపీ.. టీఆర్ఎస్ మధ్య నడుస్తున్న మాటల యుద్దం.. పర్యవసానంగా రెండు పార్టీల శ్రేణుల మధ్యతలెత్తిన వివాదాల అంశాల్ని అమిత్ షా వద్దకు తీసుకెళ్లినట్లుగా చెబుతున్నారు.

బండి సంజయ్ చేస్తున్న పాదయాత్రకు బ్రేకులు వేసే అంశంపైనా గవర్నర్ నుంచి సమాచారాన్ని అమిత్ షాకు చెప్పినట్లుగాచెబుతున్నారు. గవర్నర్ చెప్పిన మాటల్ని విన్న అమిత్ షా.. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాల్ని తనకు చెప్పాలని చెప్పినట్లుగా చెబుతున్నారు.
Tags:    

Similar News