బార్లా తెరిచేస్తూ మోడీ స‌ర్కార్ నిర్ణ‌యం

Update: 2018-01-10 10:32 GMT
మ‌రో కీల‌క నిర్ణ‌యాన్ని వెల్ల‌డించింది మోడీ స‌ర్కారు. విదేశీ ప్ర‌త్య‌క్ష‌ పెట్టుబ‌డుల‌కు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న ఆంక్ష‌ల్ని (49శాతం ప‌రిమితి) పూర్తిగా ఎత్తివేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.  సింగిల్ బ్రాండ్ రిటైల్‌.. నిర్మాణ రంగంలో విదేశీ పెట్టుబ‌డుల‌కు పూర్తిస్థాయిలో ద్వారాలు తెరుస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

దీంతో.. సింగిల్ బ్రాండ్ రిటైల్ వ్యాపారంలోనూ.. నిర్మాణ రంగంలో భారీ ఎత్తున విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులు దేశంలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. విదేశీ పెట్టుబడిదారుల‌కు స్నేహ‌పూర్వ‌క వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించే ల‌క్ష్యంతో తాజా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా ప్ర‌భుత్వం చెబుతోంది. త‌మ నిర్ణ‌యంతో ఆర్థిక వృద్ధి పెరుగుతోంద‌ని.. భారీగా ఉద్యోగ క‌ల్పన‌కు కార‌ణ‌మ‌వుతుంద‌ని భావిస్తున్నారు.

విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల్ని మ‌రింతగా ఆక‌ర్షించేందుకు కేంద్రం తీసుకున్న తాజా నిర్ణ‌యం ఉప‌క‌రిస్తుంద‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న నిబంధ‌న‌ల ప్ర‌కారం..కొన్ని వ్యాపారాలు మిన‌హా మిగిలిన ఏ వ్యాపారంలోనూ ఏ విదేశీ సంస్థ పూర్తిస్థాయిలో పెట్టుబ‌డులు పెట్టే వీలు లేదు.  తాజా నిర్ణ‌యం అందుకు భిన్నంగా.. రెండు రంగాల్లో మిన‌హాయింపులు ఇచ్చేశారు.

తాజా నిర్ణ‌యంతో ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి అనుమ‌తులు అవ‌స‌రం లేకుండా విదేశీ సంస్థ‌లు నేరుగా పెట్టుబ‌డులు పెట్టే అవ‌కాశం ఉంటుంది. అదే స‌మ‌యంలో ఎయిర్ ఇండియా విదేశీ ఎయిర్ లైన్స్ ఏదైనా స‌రే 49 శాతం వాటా కొనుగోలు చేసేందుకు వీలుగా కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. దీంతో.. ఎయిర్ ఇండియాను పాక్షికంగా ప్రైవేటీక‌ర‌ణ చేసిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. తాము తీసుకున్న నిర్ణ‌యంతో దేశంలోకి భారీ ఎత్తున పెట్టుబ‌డులు.. ఆదాయం వ‌స్తుంద‌ని భావిస్తున్నారు.
Tags:    

Similar News