సమ్మె దిశగా సర్కార్ ఉద్యోగులు... ?

Update: 2022-01-18 08:31 GMT
ఏపీలో ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య అతి పెద్ద సమరం జరిగే సీన్ కనిపిస్తోంది. ఉద్యోగులు ప్రభుత్వ తీరు పట్ల గరం గరం గా ఉంటున్నారు. పీయార్సీని పడుగ ముందు ప్రకటిస్తే  అదే బాలేదు అని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే నెత్తీ నోరు మొత్తుకుంటున్నాయి.  ఫిట్ మెంట్ లోనే మధ్యంతర భృతి కంటే కూడా నాలుగు శాతం కోత పడింది అని ఒక వైపు  వాపోతున్నారు. కనీసంగా ముప్పయి శాతం దాకా ఫిట్ మెంట్  ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు పండుగలోనే ఉద్యోగులు నిరసన తెలిపినా సెలవుల తరువాత దీని మీద చర్చలకు వెళ్ళాలనుకున్నారు.

అయితే ఈ లోగా ప్రభుత్వం కొన్ని కీలక జీవోలు జారీ చేసింది. ఆ జీవోల ప్రకారం చూస్తే పీయార్సీని అలాగే ఉంచారు, అదే టైమ్ లో హెచ్ ఆర్ ఏలో భారీ కోత విధించారు. దాంతో పాటు అనేక రకాలైన బెనిఫిట్స్ కి కటింగ్ పడింది. దీంతో ఉద్యోగులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.

ప్రభుత్వం ప్రకటించిన పీయార్సీ వల్ల భారీగా తమ జీతాలలో కోత పడిందని ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తోందని కూడా వారు అంటున్నారు. తమతో మళ్ళీ చర్చిస్తామని చెప్పిన ప్రభుత్వం ఏ చర్చలూ లేకుండానే ఇలా జీవోలు విడుదల చేయడమేంటి అని వారు నిలదీస్తున్నారు. దీంతో తాము ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు.

అన్ని ఉద్యోగ సంఘాల నేతలతో కలసి పోరాటానికి సిద్ధమవుతామని, దానికి సంబంధించిన కార్యాచరణను కూడా సిద్ధం చేస్తామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం జారీ చేసినవి దుర్మార్గమైన జీవోలు అని అంటున్నారు. అవసరం అనుకుంటే సమ్మెలోకి కూడా వెళ్తామని చెప్పారు. మూడు రోజులలో తగిన కార్యాచరణను చేపడతామని వారు చెప్పడం విశేషం. మొత్తానికి చూస్తే అటు ఉద్యోగులు, ఇటు ప్రభుత్వం మధ్యన  అతి పెద్ద అగాధం ఏర్పడింది. ఈ సమయంలో ప్రభుత్వం ఉద్యోగులతో తగ్గి చర్చలకు పిలిపించకపోతే మాత్రం కొత్త ఏడాదితోనే ఉద్యోగుల సమ్మె ఖాయంగా కనిపిస్తోంది.
Tags:    

Similar News