ఎక్సైజ్ సుంకంతో సగటుజీవికి నష్టం ఎంతంటే?

Update: 2016-01-03 06:46 GMT
మూడు రోజుల క్రితం అంతర్జాతీయ పరిణామాలకు తగ్గట్లుగా లీటరు పెట్రోల్ మీద 60 పైసలకు పైగా.. డీజిల్ మీద లీటరుకు రూపాయికి పైగా తగ్గించిన సంగతి తెలిసిందే. ముడిచమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో కనిష్ఠస్థాయికి పడిపోయినా.. కేంద్రం మాత్రం లీటరకు అర్థరూపాయి.. రూపాయి అంటూ పీనాసితనంతో వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

అలా తగ్గించి.. ఇలా పెంచేయటం ఈ మధ్యన ప్రభుత్వానికి ఒక అలవాటుగా మారింది. తాజాగా పెంచిన ఎక్సైజ్ సుంకం కారణంగా వినియోగదారుడికి మీద ఎలాంటి ప్రభావం చూపించదంటూ కేంద్ర సర్కారు చెబుతోంది. అయితే.. ఈ ఎక్సైజ్ పెంపు కారణంగా ప్రత్యక్షంగా వినియోగదారుడి మీద ప్రభావం చూపించకున్నా పరోక్షంగా మాత్రం చూపించటం విశేషం.

తాజాగా పెంచిన ఎక్సైజ్ సుంకం కారణంగా ప్రభుత్వ ఖజానానకు లభించే ఆదాయం డీజిల్ మీద రూ.4,300కోట్లు.. పెట్రోల్ మీద రూ.80కోట్లు. అంటే.. ఏకంగా రూ.5,100 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి అదనంగా లభించనుంది. మరి.. దీన్నే ప్రజలకు బట్వాడా చేసి ఉంటే..?

ఎక్సైజ్ సుంకం పెంచుతూ నిర్ణయం తీసుకోవటం ఈ మధ్య తరచూ జరుగుతోంది. కేవలం వారాల వ్యవధిలో మోడీ సర్కారు ఇలా ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ నిర్ణయాన్ని తీసుకుంది. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్.. డీజిల్ మీద మూడుసార్లు పెంచిన ఎక్సైజ్ సుంకం కారణంగా ప్రభుత్వానికి అదనంగా లభించిన ఆదాయం అక్షరాల రూ.10వేల కోట్లు.

ఇక.. 2014 నుంచి 2015 జనవరి మధ్య కాలంలో పెంచిన ఎక్సైజ్ సుంకం కారణంగా అప్పట్లో ప్రభుత్వానికి రూ.20వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఒకవేళ 2014 నుంచి ఇప్పటివరకూ ఎక్సైజ్ సుంకాన్ని పెంచకుండా పాత పద్ధతినే కొనసాగించి ఉండి.. దాని ప్రయోజనాన్ని వినియోగదారుడికి కనుక అందించి ఉంటే.. పెట్రోల్ లీటరుకు రూ.10.. డీజిల్ లీటరుకు రూ.9.97 చొప్పున తగ్గి ఉండేది. ఈ లెక్కన గడిచిన కొన్నేళ్లుగా కేవలం పెట్రోల్.. డీజిల్ కారణంగా సగటు జీవి ఎంతలా నష్టపోయారో లెక్కేసుకోవచ్చు.
Tags:    

Similar News