నల్ల కుబేరులకు లాస్ట్ ఛాన్స్ ఇచ్చేసిన మోడీ

Update: 2016-11-29 04:08 GMT
పెద్ద నోట్ల రద్దుతో కలవరపడుతున్న నల్లకుబేరులకు కేంద్రం లాస్ట్ ఛాన్స్ ఇచ్చేసింది. రద్దు నేపథ్యంలో తమ దగ్గర ఉన్న బ్లాక్ మనీని వైట్ చేసుకునేందుకు కిందామీదా పడుతూ.. కక్కుర్తితో అడ్డంగా దొరికిపోతున్న తిప్పలు ఎందుకన్న రీతిలో.. తాజాగా కేంద్రం ఒక భారీ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద తమకున్న నల్లధాన్ని ప్రకటించిన వారు.. భారీగా సొమ్ములు పోగొట్టుకునే అవకాశం ఉన్నప్పటికీ.. మనశ్శాంతి మాత్రం దొరుకుతుందన్న రీతిలో తాజా విధానం ఉండటం గమనార్హం.

రద్దు నిర్ణయంతో పాతిక నుంచి 40 శాతం వరకు కమిషన్ తో బ్లాక్ ను వైట్ గా మార్చుకునేందుకు రిస్క్ పడుతున్న నల్లకుబేరులు.. అలాంటి తిప్పలు లేకుండా నేరుగా ప్రభుత్వానికే తమ నల్ల ధనాన్ని అప్పగించేసేందుకు వీలుగా ఆఖరి అవకాశాన్ని ప్రకటించారు. ఇందుకోసం సోమవారం ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆదాయపన్ను చట్టంలో సవరణలకు ప్రతిపాదించారు.

డిసెంబరు 30 లోపు కానీ ఎవరికి వారు తమ వద్దనున్న బ్లాక్ మనీని స్వచ్ఛందంగా ప్రకటిస్తే.. దానిపై 50 శాతం వరకూ పన్ను చెల్లించి బయటకు పడొచ్చన్న అభయాన్ని ఇస్తున్నారు. ఈ యాభై శాతంలో జరిమానా.. సర్ ఛార్జీలు కూడా ఉండటం గమనార్హం. కాకుంటే.. ఈ విధానంలో ఒకే ఒక్క తిప్పలు ఏమిటంటే.. తాము ప్రకటించిన నల్లధనంలో యాభై శాతం కేంద్రానికి పోగా.. మిగిలిన యాభై శాతంలో 25 శాతం కేంద్రం వద్ద నాలుగేళ్ల పాటు ఉండిపోనుంది. తర్వాత ఆ మొత్తానికి ఎలాంటి వడ్డీ లేకుండా తిరిగి తీసుకునే వీలుంది.

అంటే.. తమ వద్ద కోటి రూపాయిలు నల్లధనం ఉంటే.. దాన్నికేంద్రానికి ప్రకటిస్తే.. అందులో యాభై లక్షలు జరిమానా.. సర్ ఛార్జ్ కింద కేంద్రం తీసేసుకుంటుంది. మిగిలినయాభై లక్షల్లో పాతిక లక్షలు కేంద్రం వద్దనే ఉంచేసుకుంటుంది. దాన్ని నాలుగేళ్ల తర్వాత రూ.25లక్షల్ని ఎలాంటి వడ్డీ లేకుండా ఇచ్చేస్తారు. అంటే.. కోటి నల్లధనాన్ని ప్రకటించిన వారి చేతిలో రూ.25లక్షలు ఇప్పటికిప్పుడు ఉండిపోయే వీలుంది.

ఇదో పద్దతి అయితే.. నల్లధనం వివరాలు వెల్లడించిన వారికి సంబంధించి మరో విధానాన్ని తాజా బిల్లులో ప్రతిపాదించారు. దీని ప్రకారం తమ ఆదాయవివరాల్ని వెల్లడించకుండా బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన రూ.వెయ్యి.. రూ.500 నోట్ల మీద 30 శాతం పన్ను విధిస్తారు. ఆ 30 శాతం పన్ను మీద 33 శాతం పీఎంజీకే  సెస్సు రూపంలో వసూలు చేస్తారు. అంటే.. ఈ విధానంలో కూడా కాస్త అటూఇటూగా 50 శాతం మొత్తాన్ని జరిమానా రూపంలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సో.. గుట్టలు గుట్టులగా బ్లాక్ మనీ పోగేసుకున్న వారు.. కక్కుర్తితో అడ్డదారులు తొక్కే కన్నా.. కాస్త గుట్టుగా తమ దగ్గరి నల్లధనాన్ని చెప్పేస్తే.. ఇప్పటికిప్పుడుయాభై పైసలు పోయినా.. అంతకు మించిన మనశ్శాంతి దొరుకుతుందనటంలో సందేహం లేదని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News