వనజాక్షికి మించిన సీన్ కు జగన్ సర్కారు ఏం చెబుతుంది?

Update: 2021-12-07 04:00 GMT
తహిసిల్దార్ వనజాక్షి ఉదంతం రేపిన కలకలం అంతా ఇంతా కాదు. చంద్రబాబు ప్రభుత్వం సరిగా స్పందించలేదన్న వాదనను నాటి విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరచూ వినిపించేవారు. ఇంత అన్యాయమా? అంటూ ఆవేదన వ్యక్తం చేసేవారు. ఒక మహిళా అధికారిని దూషిస్తారా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. తాను ముఖ్యమంత్రి అయ్యే వరకు జగన్.. తరచూ వనజాక్షి అంశాన్ని ప్రస్తావిస్తూ నాటి చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టే వారు. కట్ చేస్తే.. తాజాగా చోటు చేసుకున్న ఉదంతాన్ని చూస్తే.. వనజాక్షి ఎపిసోడ్ చాలా చిన్నదిగా చెప్పాలి..

ఎందుకంటే.. ఒక మహిళా అధికారిణిని.. ఆఫీసుకు వచ్చి.. ఆమె ఛాంబర్ లోనే ఆమెకు వార్నింగ్ ఇవ్వటమే కాదు.. ‘ఒళ్లు చీరేస్తా’ అంటూ వేలు చూపించి మరీ బెదిరించిన వైనం చూసినప్పుడు.. ఇదెక్కడి అరాచకం? అన్న సందేహం రాక మానదు. ఇంతకీ ఇదెక్కడ జరిగింది? అన్న విషయంలోకి వెళితే..తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలంలో ఎంపీడీవో కె.ఆర్. విజయను దూషించటమే కాదు.. వార్నింగ్ ఇచ్చిన వైనం షాకింగ్ గా మారింది. ఎంతకూ తగ్గని సదరు వైసీపీ నేత చేష్టల్ని పలువురు ఖండిస్తున్నారు. తానేం చెబితే అదే చేయాలని.. లేదంటే ఒళ్లు చీరేస్తామంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వైసీపీ నేతల మధ్య గ్రూపుల కారణంగా.. తమ వర్గానికి ప్రాధాన్యతను ఇవ్వటం లేదని భావించారు నల్లచెరువు గ్రామానికి చెందిన మాజీ సర్పంచి వాసంశెట్టి తాతాజీ. సోమవారం ఎంపీడీవో కార్యాలయానికి వచ్చిన ఆయన.. మహిళా అధికారిని కె.ఆర్. విజయ వద్దకు వచ్చి.. ‘‘మేం చెప్పిన మాట వినటం లేదు. మా మాట వినకపోతే చీరేస్తాం’ అంటూ సూటి వార్నింగ్ ఇచ్చేశారు.

ఆయన్ను అక్కడున్న కార్యాలయ సూపరింటెండెంట్ వారిస్తున్నా వినకుండా తీవ్ర పదజాలంతో తిట్టిన వైనంతో సదరు మహిళా అధికారి తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. కన్నీటిపర్యంతం అయ్యారు. తాను పని చేయటం ఇష్టం లేకపోతే.. ఎక్కడికైనా పంపించేయాలని చెబుతున్న మాటల్ని పట్టించుకోకుండా తన ధోరణిలోనే తాను మాట్లాడిన సదరు వైసీపీ నేత తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

చంద్రబాబు హయాంలో వనజాక్షి ఉదంతంపై అంతలా స్పందించిన నాటి విపక్ష నేత.. తమ ప్రభుత్వంలో.. ఒక మహిళా అధికారిని మాజీ సర్పంచ్ స్థాయి నేత ఆఫీసుకే వచ్చి నేరుగా బెదిరించటం.. అనుచిత వ్యాఖ్యలు చేయటం.. ఒళ్లు చీరేస్తామంటూ హెచ్చరించటం లాంటి వాటిపై సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ రీతిలో రియాక్టు అవుతారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇదిలా ఉండగా.. తనను వైసీపీ నేత తాతాజీ తిట్టారని.. తనకు రక్షణ కల్పించాలంటూ కేఆర్ విజయ అమలాపురం ఆర్టీవోకు ఫిర్యాదు చేశారు.



Full View




Tags:    

Similar News