గవర్నర్ కొడతారని రాజ్ భవన్ వెళ్లటం లేదట

Update: 2019-08-16 06:06 GMT
ఇటీవల కాలంలో ఏ గవర్న్ కూడా తెలుగు రాష్ట్రాల్లో చక్రం తిప్పనంతగా తిప్పేశారు నరసింహన్. మొన్నటివరకూ రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరించిన ఆయన.. ఇటీవల ఏపీకి ప్రత్యేక గవర్నర్ ను ఏర్పాటు చేయటంతో ఆయన తెలంగాణ రాష్ట్రానికే పరిమితమయ్యారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి గవర్నర్ గా వచ్చిన నరసింహన్ తొలిసారి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ హోదాలో పంద్రాగస్టు వేడుకల్ని నిర్వహించారని చెప్పాలి. ఆయన గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఒక తెలుగు రాష్ట్రానికే పరిమితం కావటం ఇదే. ఈ కారణంతో కావొచ్చు.. ఇటీవల కాలంలో జరిగిన ఎట్ హోంలకు భిన్నంగా.. తెలంగాణ రాష్ట్ర నేతలు.. ప్రముఖులే ఎక్కువగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

నరసింహన్ సరదా మనిషి. ఒక్కోసారి ఒక్కో నేతకు ఆయనిచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా అన్నట్లుగా ఉండదు. అదే సమయంలో మరికొన్ని సార్లు పెద్దగా పట్టనట్లుగా వ్యవహరించే నైజం ఆయనలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఆ మధ్యన హరీశ్ కావొచ్చు.. కేటీఆర్ కావొచ్చు.. దూకుడుగా ఉండే నేతల్ని ఆయన తరచూ గుర్తు పెట్టుకుంటుంటారు. తాజా ఎట్ హోంలో గవర్నర్ మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం కనిపించింది. దీనికి తగ్గట్లే వారి మధ్య ఆసక్తికర సంభాషణ నడిచింది. ఎట్ హోం కార్యక్రమంలో అతి తక్కువ సమయం గడిపిన నేతల్లో రేవంత్ ఒకరుకావటం గమనార్హం. నేతలంతా వచ్చి గవర్నర్ కు విష్ చేస్తున్న వేళ.. రేవంత్ కూడా గవర్నర్ వద్దకు వచ్చారు. ఆయన్ను చూసినంతనే గవర్నర్ స్పందిస్తూ.. వచ్చావా? రాలేదేమోనని నీ కోసమే ఎదురుచూస్తున్నా? అంటూ వ్యాఖ్యానించారు. దీనికి బదులు ఇచ్చిన రేవంత్.. మీరు పిలిచిన తర్వాత రాకుండా ఉంటానా? అని అన్నారు

మరి.. నన్ను కలవటానికి వస్తానన్నారు కదా?  ఎందుకు రాలేదని గవర్నర్ ప్రశ్నించగా.. మీరు కొడతారేమోనని అంటూ రేవంత్ సరదా వ్యాఖ్యలు చేశారు. దీనికి గవర్నర్ ఏ మాత్రం తగ్గకపోగా.. గతాన్ని గుర్తు చేస్తూ.. నేను కొట్టానా?  మీరు నన్నుకొట్టారా? అంటూ నాటి అసెంబ్లీలో రేవంత్ విసురుగా వ్యవహరించిన వైనాన్ని ప్రస్తావించారు. దీనికి రేవంత్ మరోసారి బదులిస్తూ.. అది మనసులో పెట్టుకొని ఎక్కడ కొడతారోననే రాలేదన్న మాటకు ఒక్కసారి నవ్వులు విరబూశాయి. మొత్తానికి గవర్నర్ పట్ల దురుసుగా ప్రవర్తించిన వైనాన్ని సరదాకైనా రేవంత్ ఒప్పేసుకున్నారన్న మాట రాజకీయ నేతల మాటల్లో వినిపించటం గమనార్హం.
Tags:    

Similar News