గవర్నర్‌ కి కోపం వచ్చింది...!!

Update: 2018-07-25 04:02 GMT
అవును. గవర్నర్‌ కు కోపం వచ్చింది. గవర్నర్‌‌కు ఆవేశం వచ్చింది. గవర్నర్‌ కు ఆగ్రహం వచ్చింది. ఈ కోపం... ఈ ఆవేశం... ఈ ఆగ్రహం ఎవరి మీద వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆదాయ పన్ను శాఖపై గవర్నర్ నరసింహన్ మండిపడ్డారు. అంటే నేరుగా కేంద్రం పైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నాడు హైదరాబాద్‌ లో జరిగిన ఆదాయ పన్ను శాఖ 158 వార్షికోత్సవాలకు ముఖ్యఅతిధిగా హాజరైన గవర్నర్ నరసింహన్ ఆదాయ పన్ను శాఖ కొత్తగా తీసుకువచ్చిన "ఈ" ఐటి రిటర్స్‌ పై మండిపడ్డారు. కొత్తగా తీసుకువచ్చిన ఈ విధానం తనకే అర్ధం కాలేదని - ఇక సామాన్యులకు - మధ్యతరగతికి - ముఖ్యంగా చదువురాని వారి ఎలా అర్ధం అవుతుందని ప్రశ్నించారు. " ఈ పద్దతి కంప్యూటర్‌ లో నిష్ణాతులైన వారికి మాత్రమే తెలుస్తుంది. దేశంలో కంప్యూటర్ వచ్చిన వారు ఎంత మంది ఉన్నారు" అంటూ వార్షికోత్సవ సభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి ఈ నూతన విధానాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీయే తీసుకువచ్చింది.

ఈ విషయం గవర్నర్‌ కి తెలియందికాదు.అయినా... గవర్నర్ నరసింహన్ ఈ విధంగా మాట్లాడారంటే కేంద్రంతో ఆయనకు చెడిందా అనే అనుమానాలు వస్తున్నాయి. సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌ గా వచ్చిన నరసింహన్ రాష్ట్ర విభజన తర్వాత కూడా రెండు రాష్ట్రాలకు గవర్నర్‌ గా కొనసాగుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన కేంద్రం దూతగా వ్యవహరిస్తున్నారంటూ తెలంగాణలో ప్రతిపక్షాలు - ఆంధ్రప్రదేశ్‌ లో అధికార పక్షం దుయ్యబడుతున్నాయి.   గవర్నర్‌ ను మార్చాలని - మారుస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇటీవల గవర్నర్ ఢిల్లీ వెళ్లి తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌ ల్లో రాజకీయ వ్యవహారాలు - ప్రభుత్వాల పనితీరుపై నివేదిక ఇచ్చారు. ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఢిల్లీ వెళ్లి గవర్నర్ తీరుపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కొన్నాళ్లుగా బిజెపీకి దగ్గరగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర రావును సంత్రప్తి పరచేందుకు గవర్నర్‌ను మార్చాలని  భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం చూచాయిగా గవర్నర్ నరసింహన్‌ కు కూడా తెలియజేసినట్లు సమాచారం. ఈ సమాచారం అందుకున్న నరసింహన్  తన అసహనాన్ని - ఆగ్రహాన్ని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆదాయ పన్ను శాఖపై వెళ్లగక్కినట్లు చెబుతున్నారు. త్వరలో లోక్‌ సభకు ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యంలో గవర్నర్ మార్పు అనివార్యంగా కనపడుతోంది.
Tags:    

Similar News