నాలుగు స్తంభాలాట; కేంద్రం.. గవర్నర్‌.. కడియం.. కేసీఆర్‌

Update: 2015-06-12 04:33 GMT
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య నెలకొన్న వివాదం విషయంలో గవర్నర్‌ నరసింహన్‌తో కేంద్రం ఏం చెప్పింది? ఎలా వ్యవహరించాలని సూచనలు చేసింది? రెండు రాష్ట్రాల మధ్య హాట్‌.. హాట్‌గా ఉన్న వ్యవహారాల విషయంలో గవర్నర్‌ పాత్ర ఎలా ఉండాలని కేంద్రం కోరుకుంటోంది? గవర్నర్‌ తీరు పట్ల ఏమంది? గవర్నర్‌పై వచ్చిన విమర్శల్ని ఆయనతో కేంద్రం ప్రస్తావించిందా? లాంటి ఎన్నో ప్రశ్నలకు కాస్త అస్పష్టంగా.. కొన్నింటి మీద కొద్దిపాటి స్పష్టతతో కూడిన సమాధానాలు లభిస్తున్నాయి.

ఓటు నోటు వ్యవహారం మొదలు ఫోన్‌ ట్యాపింగ్‌ అంశానికి సంబంధించి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఉన్న వాడీవేడి వాతావరణాన్ని వీలైనంత త్వరగా సమిసిపోయేలా చేయటంతో పాటు.. పరిస్థితి చక్కదిద్దాలని.. రెండు రాష్ట్ర సర్కారులు తమ పని తాము చూసుకునేలా చేయాలని గవర్నర్‌ను సూచించినట్లు చెబుతున్నారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన సందర్భంలో ఒక ప్రశ్నకు బదులిస్తూ.. రెండు రాష్ట్రాలలో ఉన్న పరిస్థితుల్ని కేంద్రానికి వివరించానని.. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయని చెప్పటం దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు.

ప్రధానమంత్రి మోడీ.. కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ.. వెంకయ్యనాయుడులతో సమావేశం ముగిసిన తర్వాత మాట్లాడిన గవర్నర్‌ ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. కేంద్రం నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి గవర్నర్‌ వెల్లడించినట్లు చెబుతున్నారు. కేంద్రం ఇచ్చిన ఆదేశాలకు తగ్గట్లుగా.. పరిస్థితులు సద్దుమణిగేలా చూడాలంటూ కడియంను గవర్నర్‌ కోరినట్లు చెబుతున్నారు.

కేంద్రం ఏం ఆలోచిస్తుంది? ఎలా వ్యవహరించాలని భావిస్తోంది? ఏపీ సీఎం వ్యవహారంలో కేంద్రం మైండ్‌సెట్‌ ఎలా ఉందన్న విషయాలపై కడియంకు గవర్నర్‌ వివరించినట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చెప్పాలంటే.. బాబుఎలా వ్యవహరించాలన్న విషయాన్ని.. తమను కలిసన సందర్భంగా కేంద్రం స్పష్టం చేసిందని.. ఇక తెలంగాణ సర్కారు ఎలా ఉండాలన్న దానిపై సూచనలు చేసిన కేంద్రం తమ మాటగా గవర్నర్‌ చేత చెప్పించిందన్న భావన వ్యక్తమవుతోంది. కేంద్రం నుంచి వచ్చిన సూచనల్ని తనను కలిసి ఉప ముఖ్యమంత్రి కడియంకు చెప్పటం ద్వారా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సమాచారం అందించారని చెబతున్నారు. బాబు బాధ్యతను తమ మీద వేసుకున్న కేంద్రం.. తమ మాటల్ని గవర్నర్‌తో కేసీఆర్‌కు చేరే ప్రయత్నం చేసిందని చెబుతున్నారు.

Tags:    

Similar News