ఆ ఏపీ ఫైల్ ను గ‌వ‌ర్న‌ర్ అలా ఉంచేశార‌ట‌!

Update: 2019-05-01 04:41 GMT
సాధార‌ణంగా రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి వ‌చ్చే ఫైల్స్ ను అదే రోజున ఓకే చేసి పంపేస్తుంటారు గ‌వ‌ర్న‌ర్లు. లేదంటే.. మ‌రో రోజు తీసుకుంటారు. కానీ.. అందుకు భిన్నంగా ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి రావ‌టానికి ముందు పంపిన ఫైల్ ను నేటికి గ‌వ‌ర్న‌ర్ వ‌ద్దే ఉన్న వైనం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సుప్రీంకోర్టు ఆదేశాలు సైతం గ‌వ‌ర్న‌ర్ పుణ్య‌మా అని అమ‌లు కాలేని ప‌రిస్థితి నెల‌కొంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇంత‌కీ ఆ ఫైల్ ఏమిటి?  అందులో ఏముంది? గ‌వ‌ర్న‌ర్ ఎందుకు త‌న వ‌ద్దే ఉంచేసుకున్నారు?  లాంటి అంశాల్లోకి వెళితే.. ఏపీ రాష్ట్ర స‌మాచార హ‌క్కు క‌మిష‌న‌ర్ల నియామ‌కానికి సంబంధించిన ఫైలు మూడు వారాల‌కు పైనే గ‌వ‌ర్న‌ర్ వ‌ద్దే ఉండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇద్ద‌రు క‌మిష‌న‌ర్ల నియామ‌కానికి సంబంధించిన ఫైలు ప్ర‌భుత్వం.. గ‌వ‌ర్న‌ర్ మ‌ధ్య తిరుగుతూనే ఉంద‌న్న మాట ప్ర‌చారంలో ఉంది.

ఏపీలో ఎన్నిక‌ల కోడ్ రావ‌టానికి ముందు ఆర్టీఐ క‌మిష‌న‌ర్లుగా ఇద్ద‌రిని ఎంపిక చేస్తూ ఏపీ ప్ర‌భుత్వం ఒక నిర్ణ‌యం తీసుకుంది. దీనికి సంబంధించిన నియామ‌క ఫైల్ ను గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద‌కు పంపింది. విజ‌య‌వాడ‌కు చెందిన మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంక‌య్య కుమారుడు ఐలాపురం రాజా.. విశాఖ జిల్లాకు చెందిన వీఆర్ఏల సంఘం మాజీ నేత ఈర్ల శ్రీ‌రామ‌మూర్తి పేర్ల‌ను ఆర్టీఐ క‌మిష‌న‌ర్లుగా సిఫార్సు చేస్తూ ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.  ఇందుకు సంబంధించిన ఫైలును గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ వ‌ద్ద‌కు పంపింది.

క‌మిష‌న‌ర్ల ఎంపిక‌కు సంబంధించిన ఫైలును మార్చి 7న పంపింది. అయితే.. ఆ ఫైల్ ను గ‌వ‌ర్న‌ర్ త‌న వ‌ద్దే ఉంచేసుకోవ‌టం.. 10న ఎన్నిక‌ల షెడ్యూల్ వెలువ‌డ‌టంతో క‌మిష‌న‌ర్ల నియామ‌కం ఆగింది. కోడ్ నేప‌థ్యంలో ఈ ఫైల్ ను త‌ర్వాత చూద్దామంటూ గ‌వ‌ర్న‌ర్ వెన‌క్కి పంప‌టంతో.. కోడ్ స‌మ‌యంలో ఈ త‌ర‌హా వ్య‌వ‌హారాల్ని చూసే ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆధ్వ‌ర్యంలోని క‌మిటీకి పంపారు. వారి నుంచి రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి ద్వివేదికి పంపారు.

ఈ ఫైల్ ను ఎన్నిక‌ల సంఘం ఆమోదం తెలుపుతూ మార్చి 29న ప్ర‌భుత్వానికి స‌మాచారం ఇచ్చింది. దీంతో.. రాష్ట్ర స‌ర్కారు మ‌రోసారి ఫైల్ ను ఏప్రిల్ తొలివారంలో గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద‌కు పంపినా.. ఇప్ప‌టివ‌ర‌కూ ఆ ఫైలుకు మోక్షం క‌ల‌గ‌లేద‌ని తెలుస్తోంది.

ఎందుకిలా అంటే.. ప్ర‌భుత్వం ఎంపిక చేసిన ఇద్ద‌రు క‌మిష‌నర్ల‌లో ఒక‌రి విష‌యంలో గ‌వ‌ర్న‌ర్ సానుకూలంగా లేర‌ని.. ఈ కార‌ణంతోనే ఫైల్ ను అలా ఆపేసిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఏపీలో స‌మాచార హ‌క్కు క‌మిష‌న‌ర్ల‌ను నియ‌మించాలంటూ సుప్రీం తీర్పును ఇచ్చింది. మూడు నెల‌ల్లో నియ‌మాకాలు జ‌ర‌గాల‌ని పేర్కొంది. ఈ లెక్క‌న చూస్తే.. క‌మిష‌న‌ర్ల నియామ‌కం అత్య‌వ‌స‌రం. అయిన‌ప్ప‌టికీ.. గ‌వ‌ర్న‌ర్ పుణ్య‌మా అని ఈ ఫైలుకు మోక్షం క‌ల‌గ‌టం లేద‌ని చెబుతున్నారు. ఒక కీల‌క ఫైలును గ‌వ‌ర్న‌ర్ అదే ప‌నిగా త‌న వ‌ద్దే ఉంచేసుకున్న వైనం ఏపీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News