జగన్ ఇచ్చిన క్లూతో బాబుపైకి గవర్నరు

Update: 2015-12-22 07:12 GMT
ఏపీ సీఎం చంద్రబాబు - గవర్నరు నరసింహన్ ల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్న సంగతి తెలిసిందే. విభజన తరువాత తెలంగాణతో ఏర్పడిన గొడవలు..  ఆ సమయంలో గవర్నరు వ్యవహరించిన తీరు కారణంగా ఇద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఉంది. తాజాగా ఏపీ విపక్ష నేత జగన్ చేసిన ఓ డిమాండు చంద్రబాబును ఇరకాటంలో పెట్టడానికి గవర్నరుకు ఆయుధంగా మారిందంటున్నారు.

గిరిజన ప్రాంతాల్లో సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటుకావలసిన గిరిజన సలహా మండలి (ట్రైబల్ అడ్వైజరీ బోర్డు)పై నరసింహన్ పెట్టిన మెలిక బాబు సర్కారును ఇబ్బందిపెడుతోంది. ఆయా జిల్లాల్లో ఉన్న మూడోవంతు గిరిజన ఎమ్మెల్యేలను ఆ కమిటీలో వేయాల్సి ఉంది. ఇప్పుడు అదే బాబు సర్కారుకు సంకటంలా పరిణమించింది.

బాక్సైట్ తవ్వకాల నేపథ్యంలో ప్రభుత్వ దూకుడుకు అడ్డకట్ట వేసే గిరిజన సలహా మండలి వ్యవహారం జగన్ ఫిర్యాదుతో ఆలస్యంగా తెరపైకొచ్చింది. ఇప్పటివరకూ కొత్త ప్రభుత్వం మండలిని ఏర్పాటుచేయకపోవడంతో, దాని గురించి ఎవరికీ తెలియకుండా పోయింది. అయితే, తాజాగా వైసీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ మోహన్‌ రెడ్డి ఇదే విషయంలో గవర్నర్ నరసింహన్‌ ను కలసి వినతిపత్రం సమర్పించారు. తక్షణం బోర్డు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. దానికి స్పందించిన గవర్నర్ గిరిజన సలహా మండలి వివ రాలు పంపాలని, దానిని తాను కేంద్రానికి పంపాల్సి ఉన్నందున, సలహా మండలిలో ఎవరిని నియమించారో తనకు వివరాలు పంపాలని గవర్నర్ కార్యాలయం, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై ప్రభుత్వంలో తర్జనభర్జన మొదలయింది. గిరిజన సలహా మండలి ఏర్పాటుచేస్తే ఒక సమస్య, చేయక పోతే మరో సమస్య. మండలి ఏర్పాటుచేస్తే అందులో మెజారిటీ సభ్యులుగా వైసీపీ ఎమ్మెల్యేలనే నియమించాల్సి ఉంటుంది. ఏర్పాటుచేయకపోతే రాజ్యాంగాన్ని ధిక్కరించినట్లు అవుతుంది. ప్రభుత్వం ఇలాంటి సంకట పరిస్థితిలో ఉంది. జగన్ ఫిర్యాదు చేస్తే సలహా మండలి గురించి తమకు గవర్నర్ లేఖ రాయడమేమిటని టిడిపి మండిపడుతోంది.

రాజ్యాంగం ప్రకారం ఐదో షెడ్యూల్ పేరా 4(1) ప్రకారం గిరిజన సలహాబోర్డు ఏర్పాటుచే శారా? లేదా అన్నదానిని వివరించాలని కోరుతూ, గవర్నర్ లేఖ రాయడాన్ని టిడిపి జీర్ణించుకోలేకపోతోంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నేతృత్వంలోని ఈ బోర్డును, ప్రభుత్వం విధిగా ఏర్పాటుచేయాల్సి ఉంది. అందులో మూడు వంతు వైసీపీకి చెందిన గిరిజన ఎమ్మెల్యేలే ఉంటారు. ఆ ప్రకా రంగా కమిటీ ఏర్పాటుచేయాలని చాలకాలం క్రితమే అధికారులు బాబుకు ఫైలు పంపినా, ఇంతవరకూ దానిపై నిర్ణయం తీసుకోకుండా ఫైల్ పక్కకుపడేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజా పరిణామాలు బాక్సైట్ తవ్వకాలపై ప్రభావం చూపుతాయని టిడిపి ఆందోళనలో ఉంది.
Tags:    

Similar News