గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ మ‌రింత పెద్ద పోస్ట్‌

Update: 2017-08-03 06:12 GMT
తెలుగురాష్ర్టాల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ ఎల్ న‌ర‌సింహ‌న్ బిజీబిజీ ఢిల్లీ టూర్ ఆస‌క్తిక‌రంగా మారింది. ఒక రోజు పర్యటన అయిన‌ప్ప‌టికీ ప‌రిపాల‌న‌, విధాన ప‌ర‌మైన నిర్ణ‌యాల్లో అత్యంత‌క కీల‌క‌మైన రాష్ట్రపతి రామ్‌ నాథ్ కోవింద్‌ - ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ - ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌య వ్య‌వ‌హారాల మంత్రితో గవర్నర్‌ నరసింహన్ భేటీ అయ్యారు. త్వరలో జరిగే గవర్నర్ల నియామకాలు - మార్పుల్లో నరసింహన్‌ పేరు కూడా ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ  ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో పై ముగ్గురితో భేటీ కావడం కొత్త ఊహాగానాలకు తెరలేపినట్లయింది.

కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన గవర్నర్‌ ఆ తర్వాత మళ్ళీ ఢిల్లీ వెళ్లి కలవలేదు. గత నాలుగైదు రోజులుగా పలువురు కేంద్ర మంత్రులు - ఎంపీలు రామ్‌ నాథ్‌ కోవింద్‌ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదే వరుసలో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ కూడా బుధవారం ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ భేటీ సందర్భంగా గవర్నర్ల మార్పుల గురించి కూడా చర్చకు వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. రెండు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లను నియమించాలని కేంద్రం భావిస్తున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో నరసింహన్‌ ఏ రాష్ట్రంలో ఉండాలని కోరుకుంటున్నారు, ఇప్పటికే ఏడేళ్లుగా ఉమ్మడి గవర్నర్‌ గా కొనసాగుతూ ఉన్నందువల్ల కొత్త బాధ్యతలను స్వీకరించడంపై ఆయన అభిప్రాయాన్ని రాష్ట్రపతి తెలుసుకున్నట్లు సమాచారం.

ఈ భేటీ అనంతరం ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి (డీవోపీటీ వ్యవహారాలు కూడా) జితేంద్రసింగ్‌ తో పార్లమెంటులో గవర్నర్‌ భేటీ అయ్యారు. ఇదే సమయంలో ప్రధానితోనూ సమావేశమయ్యారు. జమ్మూకశ్మీర్‌ రాష్ట్రంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న అశాంతిని చక్కదిద్దడానికి ప్రత్యేకంగా ఒక వ్యూహాత్మక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై చర్చ జరిగినట్లు తెలిసింది. జాతీయ భద్రతా సలహాదారు నేతృత్వంలో పనిచేసే విధంగా ఈ నూతన వ్యవస్థకు కేంద్రం ఆలోచనలు చేస్తున్నందువల్ల కశ్మీర్‌ వ్యవహారాలను పర్యవేక్షించడానికి గవర్నర్‌ నరసింహన్‌ కు నూతన బాధ్యతలు అప్పజెప్పడంపై ఈ భేటీ సందర్భంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది.

ఇవే అంశాలను గవర్నర్‌ దగ్గర పాత్రికేయులు ప్రస్తావించగా, ఇలాంటి ఊహాగానాలన్నీ మీడియాలో చూస్తున్నానని, తనకు ఏ పదవి ఇవ్వాలో కూడా నిర్ణయించేస్తున్నాయని తనదైన శైలిలో చమత్కరించారు. ఇలాంటి అంశాల గురించి తనకు తెలియదని, తాను మాత్రం కేవలం సాధారణ రీతిలో మర్యాదపూర్వకంగా మాత్రమే రాష్ట్రపతిని, ప్రధానిని కలిశానని వివరించారు.
Tags:    

Similar News