ఖరారు: ఈ రాజభోగం ఇంకొద్ది రోజులే

Update: 2015-04-07 06:19 GMT
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ వైఖరి ఇపుడు రెండు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశం అయింది. తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని, ఏపీని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఆయనకు స్థానభ్రంశం ఖాయమని చర్చలు వినిపిస్తున్నాయి. అయితే తన సీటు మారటం గురించి నరసింహన్‌ యే స్వయంగా వెల్లడించారు.

గవర్నర్‌ ను మారుస్తారని, ఆయన స్థానంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి పళనిస్వామి సదాశివంను నియమిస్తారని వార్తలు వస్తున్నాయి. నరసింహన్‌ స్థానంలో కేరళ గవర్నర్‌ గా పనిచేస్తున్న జస్టిస్‌ సదాశివంను నియమించనున్నట్లు వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు చాలా వరకు కోర్టుల బాట పడుతున్నాయి. వాటిని పరిష్కరించేందుకు, న్యాయబద్ధంగా వ్యవహరించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో పనిచేసిన జస్టిస్‌ సదాశివం సేవలు అవసరమనే భావన వినవస్తోంది. అయితే ఈ అంచనా ఎలా ఉన్నా..స్థాన భ్రంశం గురించి నరసింహన్‌ మాట్లాడటం ఆసక్తికరం!!

వివిధ సమస్యలను ప్రస్తావిస్తూ ఏపీ కాంగ్రెస్‌ నేతలు గవర్నర్‌ ను కలిశారు .ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. తాను నిబద్దతతోనే విధులు నిర్వర్తిస్తున్నానని, అయినప్పటికీ దుష్ప్రచారం జరుగుతోందని చెప్పారు. తాను ఇక్కడి నుంచి వెళ్లిన తర్వాత తన విలువ ఏమిటనేది తెలుస్తుందని చెప్పారు. ప్రజలే తెలుసుకుంటారని ఆయన కాస్త ఆవేదనతోనే వ్యాఖ్యానించినట్లు సమాచారం.

అయితే గవర్నర్‌ నోటి నుంచే ఆయన మారుస్తారనే వ్యాఖ్యలు రావడం ఇక్కడ గమనించదగ్గ విషయం. కేంద్రం ఆయన్నునిజంగానే మార్చనుందా? ఆ మార్పు ముందే నరసింహన్‌ కు తెలిసిందా? కొద్దిరోజుల్లో ఈ సందేహం తీరుతుందేమో.

Tags:    

Similar News