నరసింహన్ రిటైర్మెంట్ కన్ఫర్మ్..?

Update: 2017-02-02 09:36 GMT
ఏడాదిలో రెండుసార్లు ప్రతి రాష్ట్ర గవర్నర్ ఆనవాయితీగా నిర్వహించే కార్యక్రమం ‘‘ఎట్ హోం’’. బ్రిటీషోడి నుంచి అరువు తెచ్చుకున్న సంప్రదాయాల్లో ఇదొకటి. ఆ రోజు.. ప్రముఖుల్ని గవర్నర్ పిలిచి.. విందు నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమం మొత్తాన్ని చూస్తే.. ప్రజలకు పనికి వచ్చేదేమీ ఉండదు. కాకుంటే.. ప్రజాసొమ్ము అతిధి మర్యాదల కోసం ఖర్చు అయిపోతుంటుంది. అలా అని ఈ సంప్రదాయాన్ని విమర్శిస్తే.. స్వాతంత్ర్య దినోత్సవం రోజున.. గణతంత్ర దినోత్సవం రోజున నిర్వహించే విందుల విషయంలోనూ తప్పులు వెతకటమేనా? అని క్వశ్చన్ చేయొచ్చు.

ఖర్చు లెక్కన పక్కన పెడితే.. ఈ ఎట్ హోం కార్యక్రమానికి సంబంధించిన ఆసక్తికర చర్చ ఒకటి తాజాగా తెలుగు రాజకీయాల్లో జరుగుతోంది. ఈ జనవరి 26న గవర్నర్ నరసింహన్ నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమం.. గతానికి భిన్నంగా జరగటం ఒక ఎత్తు అయితే.. ఈ కార్యక్రమంలో గవర్నర్ దంపతులు వ్యవహరించిన తీరుపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది.

అప్పుడెప్పుడో యూపీఏ 2 హయాంలో రాష్ట్రానికి గవర్నర్ గా వచ్చిన నరసింహన్.. దీర్ఘ కాలం పాటు సాగారని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రత్యేక పరిస్థితులతో పాటు.. నరసింహన్ తో ప్రధాని మోడీకి ఉన్న అనుబంధం వల్ల ఆయన రెండో టర్మ్ ను విజయవంతంగా నడిపిస్తున్నారని చెప్పాలి. అయితే.. మరోసారి ఆయన గవర్నర్ గా కొనసాగే ఛాన్స్ లేదనే చెప్పాలి.

దీనికి తగ్గట్లే ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు గవర్నర్ కు అందినట్లు చెబుతున్నారు. ఆయన పదవీ విరమణ ఈ ఆగస్టులోపే ఉండనుండటంతో.. ఆయనీసారి నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమాన్ని కాస్త భిన్నంగా నిర్వహించినట్లుగా చెబుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా సీనియర్ ఐఏఎస్ లు.. ఐపీఎస్ లనుప్రత్యేకంగా ఆహ్వానించిన గవర్నర్.. ఎట్ హోం కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరుపేరునా పిలవటం.. స్వయంగా అల్పాహారాన్ని వడ్డించటం గమనార్హం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరోసారి ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించే అవకావం నరసింహన్ కు లేని నేపథ్యంలో తన చివరి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించటంతో పాటు.. తన సన్నిహితులందరిని ఆహ్వానించటం ద్వారా.. అందరి మనసుల్ని దోచుకునే ప్రయత్నం చేశారని చెబుతున్నారు. ఎట్ హోం కార్యక్రమాన్ని చూసిన వారంతా..నరసింహన్ నిర్వహించే ఇదే ఆఖరి ఎట్ హోం అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.అంటే.. ఆగస్టు 15 లోపే పదవి నుంచి పక్కకు వెళ్లిపోనున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News