టీ తమ్ముళ్లను కూల్ చేసేసిన గవర్నర్

Update: 2016-09-15 04:16 GMT
రాజకీయనేతలెంత అల్ప సంతోషులో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి కోపం పెనం మీద నీళ్లు లాంటిది. కోపం వచ్చినప్పుడు తీవ్రంగా రియాక్ట్ అవుతూనే.. అంతలోనే కామ్ అయిపోవటం వారికే చెల్లుతుంది. తమ ఆగ్రహం ఎక్కడ.. ఎంత వరకూ ఉండాలన్న విషయంలో రాజకీయనేతలకు ప్రీపోగ్రామ్ ఏమైనా ఉంటుందా? అనిపించక మానదు. నిన్నటికి నిన్న గవర్నర్ తమను చిన్నచూపు చూస్తున్నారని.. తాము ఎన్నిసార్లు ప్రయత్నించినా తమకు అపాయింట్ మెంట్ ఇవ్వటం లేదంటూ తెలంగాణ తెలుగుదేశం నేతలు గవర్నర్ నరసింహన్ పై తీవ్రంగా విమర్శలు చేశారు.

తమకు తప్ప మిగిలిన రాజకీయ నేతలతో పాటు.. పలు సంస్థలకు సైతం కలిసేందుకు అపాయింట్ మెంట్ ఇచ్చే గవర్నర్.. తమ విషయంలో మాత్రం పక్షపాతం ప్రదర్శిస్తున్నారంటూ ఘాటు విమర్శ చేశారు. ఈ విషయం మీడియా ద్వారా తెలిసిందో.. లేదంటే వేగుల ద్వారా తెలుసుకున్నారో కానీ.. ఈ విమర్శలు చేసిన గంటల వ్యవధిలోనే తన అపాయింట్ మెంట్ ఇచ్చేసి కూల్ చేసేశారు.

గవర్నర్ అపాయింట్ మెంట్ ఇచ్చిన వెంటనే.. అప్పటివరకు విసిరిన విసుర్లను పక్కన పెట్టేసిన తెలంగాణ తమ్ముళ్లు గవర్నర్ ను కలిసి.. మల్లన్నసాగర్ నిర్వాసిథులకు 2013 భూసేకరణ చట్టం అమలు చేయటం లేదని.. మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం సక్రమంగా లేదంటూ ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేశారు. ఇదిలా ఉంటే.. ఈ సందర్భంగా తెలుగు తమ్ముళ్లు.. గవర్నర్ మధ్య సరదా సంభాషణ చోటు చేసుకుంది. తమ పార్టీని ప్రత్యేకంగా ఎన్నికల సంఘమే గుర్తింపు ఇచ్చిందని.. కానీ గవర్నర్ మీద గుర్తించటం లేదంటూ కడుపులో ఉన్న కోపాన్ని కాస్తంత కామెడీని మిక్స్ చేసి గవర్నర్ దగ్గర ప్రదర్శించారు తెలుగుతమ్ముళ్లు.

వారి ఆవేధనపై ముందు సమాచారం ఉన్న గవర్నర్.. వారి మాటలకు తగ్గట్లు రియాక్ట్ అవుతూ.. ‘‘మీరంతా వచ్చి నాపై దాడి చేస్తే నాకు రక్షణ ఎవరు?’’ అంటూ తెలంగాణ తెలుగుదేశం శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డిని చూపిస్తూ జోక్ చేశారు గవర్నర్.  గతంలో ఆయనపై అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కాస్త హడావుడి చేయటాన్ని తన మాటతో చెప్పకనే చెప్పేశారు గవర్నర్. దీనికి రిటార్ట్ అన్నట్లుగా రేవంత్ రెడ్డి రియాక్ట్ అవుతూ.. గతంలో తనతో గవర్నర్ పై విరుచుకుపడిన వారిని మంత్రుల్ని చేశారని.. తనను మాత్రం మాటలంటున్నారంటూ జోకేయటంతో అటు గవర్నర్ తో పాటు.. మిగిలిన తమ్ముళ్లు నవ్వుల్లో మునిగిపోయారు. అపాయింట్ మెంట్ ఇవ్వలేదని నిన్నటికి నిన్న విరుచుకుపడిన తెలుగు తమ్ముళ్లు తాజాగా మాత్రం.. జోకులు వేసుకోవటం చూస్తే.. రాజకీయాలంటే అంతే మరి అనుకోవాల్సిందే.
Tags:    

Similar News