జీహెచ్ ఎంసీకి పరీక్ష పెట్టిన గవర్నరు

Update: 2016-05-22 06:13 GMT
గ్రేటర్‌ బల్దియా పనితీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు గవర్నర్‌ నరసింహన్‌ స్వయంగా రంగంలోకి దిగారు. మొన్న ఈదురుగాలులతో వర్షం కురిసినప్పుడు నగరంలోని పలు ప్రాంతాలు అతలాకుతలమైన విషయం తెలిసిందే. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపోయి ట్రాఫిక్‌ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో వివిధ విభాగాలు అధికారులు కలిసి సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయన్న ఉద్దేశంలో ఇటీవలే గ్రేటర్‌ బల్దియా ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక ఎమర్జెన్సీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీనికి డయల్‌ 100కు - బల్దియాకు చెందిన 040– 21111111 అనే నెంబర్‌ ను అనుసంధానం చేశారు. ఈ రెండు నంబర్లలో దేనికి ఫోన్‌ చేసినా సరే సంబంధిత విభాగాలకు చెందిన సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సమస్యను పరిష్కంచాల్సి ఉంటుంది.

అయితే జీహెచ్ ఎంసీ ప్రవేశపెట్టిన ఎమర్జెన్సీ సేవల తీరు ఎలా ఉందో పరిశీలించాలని అనుకున్న గవర్నరు అందుకు ఓ ఎత్తుగడ వేశారు. సామాన్య ప్రజల మాదిరిగానే ఆయన 100 నంబరుకు ఫోన్ చేశారు. తాను గవర్నరును అని చెప్పకుండా  మాదాపూర్‌ లోని ఒక ప్రాంతంలో చెట్లు కూలిపోయినట్లుగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు అందుకున్న జీహెచ్‌ ఎంసీ సిబ్బంది వెనువెంటనే అక్కడకు వెళ్ళి వెంటనే వాటిని తొలగించారు. రెండు గంటల అనంతరం గవర్నర్‌ మాదాపూర్‌ పోలీసు స్టేషన్‌ కు ఫోన్‌ చేసి తాను ఫిర్యాదు చేసిన ప్రాంతంలో చెట్లు తొలగించారా? లేదా? సమాచారాన్ని అందించాలని పోలీసులను ఆదేశించారు. వెంటనే పోలీసు సిబ్బంది అక్కడకు వెళ్ళి పూర్తి సమాచారాన్ని సేకరించారు. విరిగిపోయిన చెట్లను తొలగించారని గవర్నర్‌ కు మాదాపూర్‌ పోలీసులు సమాచారాన్ని అందించారు. ప్రస్తుతం ఆ దారిలో ఎలాంటి ట్రాఫిక్‌ సమస్య లేదని కూడా స్పష్టం చేశారు. దీంతో గవర్నరు చాలా సంతోషించారట. ఒక సామాన్య వ్యక్తిలా  తాను చేసిన ఫిర్యాదుపై స్పందించిన తీరు బాగుందంటూ వెంటనే గ్రేటర్‌ బల్దియా కమిషనర్‌ జనార్ధన్‌ రెడ్డికి ఫోన్‌ చేసి ఆయన తన అభినందనలు తెలిపారు.

ఇటీవల ఢిల్లీలో పోలీసుల సహాయం కోసం ఓ న్యాయమూర్తి అక్కడి పోలీసుల నంబర్ డయల్ 100కి ఫోన్ చేయగా ఎలాంటి సహాయం అందక భంగపడిన విషయం తెలిసిందే. చివరికి అత్యవసర నంబర్ల సహాయాన్ని దారిలో పెట్టాలంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. ఆ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయమైంది. ఆ నేపథ్యంలోనే గవర్నరు హైదరాబాద్ లో అత్యవసర నంబరు ఎలా పనిచేస్తుందో పరీక్షించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి గవర్నర్‌ పెట్టిన పరీక్షలో జీహెచ్‌ ఎంసీ పాసైనట్లే.

Tags:    

Similar News