మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన... బీజేపీ పక్కా ప్లానింగేనా?

Update: 2019-11-12 15:30 GMT
రోజుకో రీతిన ఉత్కంఠ రేకెత్తించిన మహారాష్ట్రలో అందరికీ షాకిస్తూ... కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు రాష్ట్రపతి పాలనను విధించేసింది. మహారాష్ట్రలో అమల్లోకి వచ్చేసిన రాష్ట్రపతి పాలన... పేరుకు రాష్ట్రపతి ఆదేశాలే అయినా... మొత్తం వ్యవహారాన్ని నడిపేది కేంద్ర ప్రభుత్వమే కదా. అంతేకాకుండా దేశంలోని ఏదేనీ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లోకి రావాలంటే కేంద్ర ప్రభుత్వం కదిపే పావులే కీలకం కదా. ఈ లెక్కన ఇప్పుడు మహారాష్ట్రలో అమల్లోకి వచ్చిన రాష్ట్రపతి పాలన... కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు వ్యూహమేనన్న వాదన కూడా గట్టిగానే వినిపిస్తోంది. అంతేకాకుండా ఇటీవలి కాలంలో ఆయా రాష్ట్రాల్లో బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాలను గుర్తు చేసుకున్నా...మహారాష్ట్రలో తనకు అధికారం దక్కదని తేలిన తర్వాత బీజేపీ రచించిన వ్యూహం మేరకే మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన దిశగా గవర్నర్ చర్యలు చేపట్టారన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

గత నెల జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి గానీ, కూటమికి గానీ క్లిస్టర్ క్లియర్ మెజారిటీ రాని నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను ప్రయోగించారు. తొలుత అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీకి, ఆ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేనకు, తదనంతరం మూడో అతిపెద్ద పార్టీగా ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి గవర్నర్ కబురు పంపారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ ఆ మూడు పార్టీలకు వరుసగా అవకాశం ఇచ్చారు. తొలి రెండు అవకాశాల వరకైతే ఓకే గానీ... ఎన్సీపీకి దక్కిన మూడో అవకాశం విషయంలో గవర్నర్ వ్యవహరించిన తీరే అనుమానాలకు తావిస్తోందని చెప్పక తప్పదు.

తొలుత బీజేపీకి అవకాశం ఇచ్చినప్పుడు... బీజేపీ తనకు తానుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేనని చెప్పిన తర్వాతే రెండో అతి పెద్ద పార్టీగా ఉన్న శివసేనకు రాజ్ భవన్ నుంచి పిలుపు వచ్చింది. ఆ తర్వాత తనకిచ్చిన గడువులోగా బలనిరూపణ సాధ్యం కాదని, మరో రెండు రోజులు గడువు ఇవ్వాలని శివసేన కోరిన తర్వాతే... గవర్నర్ ఎన్సీపీని పిలిచారు. అయితే ఎన్సీపీకి ఇచ్చిన గడువు ముగియకుండానే రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకోవడం నిజంగానే ఆశ్చర్యం కలిగించక మానదు. మంగళవారం రాత్రి 8.30 గంటల వరకు ఎన్సీపీకి గడువు ఉన్నా... మంగళవారం మధ్యాహ్నమే రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫారసు చేశారు. దీంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన వెనుక బీజేపీ మాస్టర్ ప్లాన్ ఉందన్న కోణంలో ఆసక్తికర విశ్లేషణలు కొనసాగుతున్నాయి.
Tags:    

Similar News