తెతెదేపా నేతలపై గవర్నర్ సెటైర్!

Update: 2018-01-14 08:47 GMT
తన మాట తీరు గురించి.. విపక్షాలకు చెందిన నాయకులు వచ్చినప్పుడు వారితో వ్యవహరించే వైఖరి గురించి ఎవరు ఎన్ని మాటలు అంటున్నా.. ఎన్ని విమర్శలు చేస్తున్నా.. రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పెద్దగా ఖాతరు చేసేలా కనిపించడం లేదు. కేసీఆర్ సర్కారు మీద బోలెడు పితూరీలతో చిట్టా సిద్ధం చేసుకుని కాంగ్రెస్ నాయకులు కలవడానికి వెళ్లినప్పుడు.. గవర్నర్ నరసింహన్ కేసీఆర్ మరియు కేటీఆర్ మీద కాస్త మెతకగా వ్యవహరించరాదా అని కోరినట్లుగా గతంలో ఆరోపణలు వచ్చాయి. విపక్ష నాయకులను గవర్నర్ చులకనగా మాట్లాడుతున్నారని కూడా గతంలో కాంగ్రెస నాయకులు పలుమార్లు విసుర్లు విసిరారు. తాజాగా గవర్నర్ ను కలిసిన తెతెదేపా నాయకులు.. పూలబొకే ఇచ్చి సంక్రాంతి గ్రీటింగ్స్ చెబితే.. అయినా ఇది ఆంధ్రాలో చేసుకునే పండగ కదా.. మీరు గ్రీటింగ్స్ చెప్పడం ఎందుకు అని గవర్నర్ వారి మీద సెటైర్ వేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో ఖంగుతినడం తెలంగాణ నేతల వంతయింది.

సంక్రాంతి ఎంద పెద్ద పండుగ అయినప్పటికీ.. తెలంగాణలో దీని ఊసు చాలా పరిమితంగానే ఉంటుంది. సాధారణంగా పొంగల్ గా పిలుచుకునే ఈ మకర సంక్రమణ వైభవం తమిళనాడు రాష్ట్రంలో మరింత ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడ మరింత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. సీమాంధ్ర పరిధిలో కూడా ఏడాది పొడవునా అన్ని పండుగలలోకి సంక్రాంతినే ముఖ్యమైనదిగా జరుపుకుంటారు. అయితే తెలంగాణలో ప్రధానమైన పండుగ అంటే దసరానే. తతిమ్మా ఏ పండుగలైనా దాని తరువాతే..! సంక్రాంతి ఊసు చాలా పరిమితం! సెలవులు వస్తాయి గనుక.. పండగచేసుకోవడమే తప్ప.. ప్రత్యేక ఆర్భాటం ఈ పండుగకు అస్సలు ఉండదు. ఇలాంటి నేపథ్యంలో తమ పార్టీ నాయకుడు ఒంటేరు ప్రతాప్ రెడ్డిని అరెస్టు చేసినందుకు నిరసనగా.. గవర్నర్ కు ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చిన తెతెదేపా నాయకులు తనకు బొకే ఇచ్చి గ్రీటింగ్స్ చెప్పగానే.. ఇది ఆంధ్రుల పండుగ కదా.. అని గవర్నర్ వ్యాఖ్యానించడం సెటైరేనని జనం నవ్వుకుంటున్నారు.

తమాషా ఏంటంటే.. గవర్నర్ నరసింహన్ స్వతహాగా తమిళుడు. ఎవరికి ఎలా ఉన్నా.. తమిళులకు ఈ పొంగల్ చాలా ముఖ్యమైన పండుగ. తెతెదేపా నాయకులు కాస్త సమయోచితంగా.. ‘మీరు తమిళులు గనుక.. శుభాకాంక్షలు చెబుతున్నాం సార్’ అని ఉంటే పొంగిపోయి ఉండేవారేమోనని జనం సరదాగా నవ్వుకుంటున్నారు.
Tags:    

Similar News