కేసీఆర్ చేసిన అవమానాల చిట్టా విప్పిన గవర్నర్ తమిళ సై

Update: 2022-04-08 04:00 GMT
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ వర్సెస్ ముఖ్యమంత్రి అన్నట్లుగా కొంతకాలం సాగుతున్న లొల్లికి సంబంధించి.. ఇటీవల కాలంలో ఓపెన్ అవుతున్నారు గవర్నర్ తమిళ సై. తాజాగా ఢిల్లీకి వెళ్లిన ఆమె ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన ఆమె.. సీఎం కేసీఆర్ తీరుపై తాను ఎదుర్కొంటున్న అవమానాల చిట్టా చెప్పినట్లుగా చెబుతున్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా ఆమె మీడియా భేటీ సాగింది. ఈ సందర్భంగా తనను సీఎం కేసీఆర్ చేసిన అవమానాల్ని ఏకరువు పెడుతూనే.. తాను తలుచుకుంటే కేసీఆర్ సర్కారు కూలిపోయి ఉండేదన్నారు. అయినప్పటికీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని తాను కూల్చలేదన్నారు.

సీఎం కేసీఆర్ పై గవర్నర్ తమిళ సై విప్పిన అవమానాల చిట్టాను చూసినప్పుడు.. ప్రోటోకాల్ ప్రకారం చేయాల్సిన అంశాలతో పాటు.. కనీస మర్యాద కోసమైనా చేసేవి ఉండటం గమనార్హం. అంతేకాదు.. తనపై చేస్తున్న విమర్శలకు ఆమె సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. జనవరి 26న తన ప్రసంగ ప్రతిని తానే తయారు చేసుకోవటానికి గల కారణాల్నిఆమె వెల్లడించారు. ఇలా.. సీఎం కేసీఆర్ తీరు కళ్లకు కట్టేలా  గవర్నర్ తమిళ సై తనకు ఎదురైన అవమానాల చిట్టాను విప్పారు.ఆ వివరాల్లోకి వెళితే..
-  అసెంబ్లీలో ప్రసంగం చేయకున్నా.. శాసనసభ సమావేశం కావడానికి గవర్నర్‌ అనుమతించాల్సి ఉంటుంది. ఆరు నెలలపాటు సమావేశం కాకపోతే అసెంబ్లీ రద్దవుతుంది. చివరిసారిగా గత ఏడాది సెప్టెంబరులో అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. దాదాపు 5 నెలల రెండు వారాల వ్యవధి తర్వాత బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్‌ సమావేశాల ప్రారంభానికి అనుమతి కోరుతూ వచ్చిన ఫైలును మరో 15 రోజులపాటు పెండింగ్‌లో పెడితే రాజ్యాంగ నిబంధనల మేరకు అసెంబ్లీ రద్దయ్యేది. నేను అనుమతి ఇవ్వబోనని అందరూ అనుకున్నారు. కానీ, నేను అలా చేయలేదు. అలా చేస్తే ప్రభుత్వం అప్పుడే రద్దయ్యేది.

-  ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టడం ఇష్టం లేదు. గతంలో వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఇలా చేసింది. దానిని నేను సమర్థించను.
-  నా తల్లి మరణిస్తే పరామర్శించాలన్న కనీస మర్యాద కూడా సీఎం కేసీఆర్‌కు లేదు. నేను ఫోన్‌ చేసి చెప్పినా పట్టించుకోలేదు. మూడు గంటలపాటు పార్థివ దేహం రాజ్‌భవన్లోనే ఉన్నా పరామర్శకు రాలేదు.
-  మా అమ్మ మరణించినప్పుడు రాష్ట్రపతి.. ప్రధాని..సీఎం ఆఫీసులకు నేనే ఫోన్ చేశా. విషయం చెప్పగానే రాష్ట్రపతి, ప్రధాని అందుబాటులోకి వచ్చి ఫోన్‌లో మాట్లాడారు. చాలా బాధపడ్డారు. విషయం తెలుసుకొని అమిత్‌ షా నాకు ఫోన్‌ చేశారు. కానీ, సీఎం కేసీఆర్‌ స్పందించలేదు.

-  మా అమ్మ పార్థివ దేహాన్ని చెన్నై తీసుకెళ్లిన తర్వాత పుదుచ్చేరి సీఎం వచ్చి పరామర్శించారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో మా అమ్మ ఏడాది పాటు గడిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం పరామర్శించలేరా?
-  ఇటీవల హైదరాబాద్‌ వచ్చిన ప్రధాని మోదీకి స్వాగతం పలకడానికి సీఎం కేసీఆర్‌ ఎందుకు రాలేదు? నన్ను విమర్శించే వాళ్లు ఎవరైనా రాజ్‌భవన్‌కు వచ్చినా నేను స్వాగతం పలుకుతాను. కేంద్రం నుంచి ప్రధాని వస్తే స్వాగతం పలకడం రాజ్యాంగపరమైన విధి. క్తిగతంగా కటాఫ్‌ కావడమనేది అసాధారణం.
-  కౌశిక్‌ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఆపేసిన తర్వాత సీఎం కేసీఆర్‌ ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఒకటి, రెండుసార్లు ఫోన్‌ చేస్తే సీఎం స్పందించలేదు. ఏదైనా కీలక అంశాలు ఉన్నా.. పుదుచ్చేరి వెళ్లే ముందు సీఎంకు ఫోన్‌ చేసి చెప్పేదాన్ని. తర్వాత కాలంలో ఫోన్‌కు స్పందించలేదు. నేనూ ఫోన్‌ చేయడం మానేశాను.
-  ఇటీవల కేసీఆర్‌ పుట్టినరోజున ఫోన్‌ చేశాను. బొకే పంపించాను. ఇటీవల కేసీఆర్‌ ఆస్పత్రిలో చేరితే బొకే పంపించాను. కానీ, ఆయన స్పందించలేదు. కనీసం కృతజ్ఞతలు చెప్పలేదు. కేసీఆర్‌ది మంచి పద్ధతి కాదు. చరిత్రలో ఇది తప్పుగా రికార్డు అవుతుంది.

-  గత 10 నెలలుగా సీఎం కేసీఆర్‌ రాజ్‌భవన్‌కు రాలేదు. నేను ఆస్పత్రులను సందర్శించడం, రాజ్‌భవన్‌ ముందు ఫిర్యాదుల బాక్స్‌ను ఏర్పాటు చేయడం, ఎమ్మెల్సీ పదవికి కౌశిక్‌ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఆమోదించకపోవడం వంటి కారణాలతో ప్రభుత్వ వర్గాలు ఇలా వ్యవహరిస్తున్నాయని అనుకుంటున్నాను
-  గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్‌ ప్రసంగించాల్సి ఉంటుంది. కాబట్టి, ప్రసంగ ప్రతి కోసం ప్రభుత్వాన్ని సంప్రదించాం. కానీ, ప్రభుత్వం స్పందించలేదు. దాంతో, నా ప్రసంగం నేనే తయారు చేసుకున్నాను. తెలంగాణ ప్రజలను, ప్రధాని మోదీని అభినందిస్తూ ప్రసంగించాను
-  ఉగాది వేడుకల ఫ్లెక్సీలో సీఎం కేసీఆర్‌ ఫొటో లేకపోవడంపై వివరణ ఇస్తూ.. రాజ్ భవన్ లో నిర్వహించే కార్యక్రమంలో సాధారణంగా రాష్ట్రపతి.. ప్రధాని ఫోటోలనే పెడతాం. రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమానికి సీఎంను ఆహ్వానించాం. బ్యానర్‌పై సీఎం ఫొటో పెట్టాం.. కానీ ఆయన రాలేదు.  

-  నేను మేడారం వెళ్లినప్పుడు గిరిజన వ్యవహారాల శాఖ కార్యదర్శి, కలెక్టర్‌, ఎస్పీ ఎందుకు రాలేదు.  ఇదా వాళ్లు ఇచ్చే గౌరవం. ఇలా గవర్నర్‌ కార్యాలయాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు? ఎందుకు అవమానపరుస్తున్నారు. నేను ఎవరినీ బహిరంగంగా విమర్శించడం లేదు.
-  తనకు హెలికాఫ్టర్ ఇవ్వటానికి నిరాకరించిన వైనాన్ని గుర్తు చేస్తూ.. ఈనెల 10న భద్రాచలం వెళ్తున్నాను. 11న శ్రీరామ పట్టాభిషేకానికి హాజరవుతాను. గిరిజన ప్రాంతంలో పర్యటిస్తాను. అక్కడికి రైల్లో వెళతాను. తెలంగాణలో నేను కేవలం రోడ్డు లేదా రైలు మార్గంలోనే ప్రయణించాల్సి వస్తోంది. మేడారం జాతరకు, నాగర్‌కర్నూలుకు కూడా రోడ్డు మార్గంలోనే ప్రయాణించాను. తెలంగాణలో గవర్నర్‌ రవాణా పద్ధతులు ఇవే.
Tags:    

Similar News