నన్ను అవమానించారు.. మరోసారి భగ్గుమన్న గవర్నర్ తమిళిసై.. సంచలన వ్యాఖ్యలు

Update: 2022-09-08 09:44 GMT
తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తమిళిసై రెచ్చిపోయారు. కేసీఆర్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. తెలుగులో ప్రసంగాన్ని మొదలుపెట్టిన తమిళిసై అనంతరం ఇంగ్లీష్ లో కొనసాగించారు.

రాష్ట్రానికి మంచి చేయాలనేదే తన అభిలాష అని.. ప్రభుత్వం గౌరవం ఇవ్వకపోయినా తాను పనిచేస్తామని చెప్పారు. రాజ్ భవన్ ప్రజాభవన్ గా మారిందని గవర్నర్ తమిళిసై అన్నారు. రాజ్ భవన్ ప్రజాభవన్ గా మారిందని తమిళిసై పేర్కొన్నారు. ప్రజల్లో విశ్వాసం పెరిగిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. స్త్రీల సమస్యలు తగ్గించేందుకు మహిళా దర్బార్ నిర్వహించామని గుర్తు చేశారు. 75మంది మెరిట్ విద్యార్థులకు ఆగస్టు 15న బహుమతులు అందించామని తెలిపారు.

తెలంగాణ గవర్నర్ గా మూడేళ్లుగా చాలా అవమానాలు ఎదుర్కొన్నాని గవర్నర్ తమిళిసై వాపోయారు. ఎట్ హోంకు వస్తానని చెప్పిన కేసీఆర్ రాలేదని ఆమె అన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియాలన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకుంటున్న సమయంలో ఇలా వివక్ష చూపడం సరైంది కాదని గవర్నర్ హితవు పలికారు.

ప్రజలను కలవాలని అనుకున్న ప్రతీసారి ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. గతంలో మేడారం జాతరకు వెళ్లేందుకు హెలిక్యాప్టర్ అడిగినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని తమిళిసై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమ్మక్క -సారక్క జాతరకు వెళ్లేందుకు రోడ్డు మార్గంలో 8 గంటలు ప్రయాణించానని ఆమె చెప్పుకొచ్చారు.

ఎక్కడికి వెళ్లినా ప్రొటోకాల్ ఇవ్వడం లేదని తమిళిసై మండిపడ్డారు. కొన్ని విషయాలు బయటకు చెప్పడం మంచిది కాదని ఈ సందర్భంగా గవర్నర్ వ్యాఖ్యానించడం సంచలనమైంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పేదల కోసం తన పని తాను కొనసాగిస్తానంటూ తమిళిసై స్పష్టం చేశారు. తనకు గౌరవం ఇచ్చిన ఇవ్వకపోయినా పట్టించుకోనని.. రాజ్ భవన్ ను గౌరవించాలి కదా? అని ఆమె వ్యాఖ్యానించారు. బాసరలో విద్యార్థుల సమస్యలు చూసి చలించిపోయానని కేసీఆర్ సర్కార్ ను తూర్పారపట్టారు.

తెలంగాణలో గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన గ్యాప్ అంతకంతకూ పెరిగిపోతోంది. కొద్దిరోజుల క్రితం గవర్నర్ తమిళిసై ఢిల్లీకి వెళ్లి మరీ కేంద్రం పెద్దలకు ఫిర్యాదు చేశారు. ప్రొటోకాల్ పాటించడం లేదని మండిపడ్డారు. ఇప్పుడు ఏకంగా డైరెక్టుగా కేసీఆర్ సర్కార్ పై ఫైటింగ్ కు దిగారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News