హెలికాఫ్టర్ ఇవ్వని సీఎంకు షాకిచ్చేలా గవర్నర్ రైలు ప్రయాణం

Update: 2022-04-11 05:58 GMT
గడిచిన కొంతకాలంగా గుట్టుగా సాగుతున్న గవర్నర్ - సీఎం లొల్లి.. ఈ మధ్యన బయటకు రావటం.. సంచలనంగా మారటం తెలిసిందే. ప్రోటోకాల్ ను పట్టించుకోకపోవటం ఒక ఎత్తు అయితే.. తనకు ఇవ్వాల్సిన వసతుల విషయంలోనూ కేసీఆర్ సర్కారు కోత పెడుతోందన్న ఫిర్యాదును ఈ మధ్యన మీడియాతో మాట్లాడిన సందర్భంలో గవర్నర్ తమిళ సై వెల్లడించారు. గవర్నర్ హోదాలో రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా హెలికాఫ్టర్ లో ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది.

అయినప్పటికి.. హెలికాఫ్టర్ ఇవ్వటానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించటం లేదని ఆరోపించిన తమిళ సై.. ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్నారు.

భద్రాద్రిలో స్వామి వారి దర్శనం తర్వాత.. చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో రెండు రోజుల పాటు పర్యటించాలని భావిస్తున్న గవర్నర్ తమిళ సై అందుకు తగ్గట్లే షెడ్యూల్ ను సిద్ధం చేసుకున్నారు. ఇందులో బాగంగా ఆదివారం రాత్రి పదకొండు గంటల సమయంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి భద్రాచలం రైల్వే స్టేషన్ కు మణుగూరు ఎక్స్ ప్రెస్ కు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోగీలో బయలుదేరారు. కొత్తగూడెం వరకు ట్రైన్లో వెళ్లనున్న గవర్నర్ కు అధికారులు స్వాగతం పలకనున్నారు.

రైలులో భద్రాచలం వెళుతున్నందుకు ఆనందంగా ఉందన్న ఆమె.. సోమవారం సీతారామాచంద్రస్వామి ఆలయంలో జరిగే పట్టాభిషేక కార్యక్రమంలో గవర్నర్ హాజరు కానున్నారు. అనంతరం ఆమె వనవాసి కల్యాణ్ ఆశ్రమం ఆధ్వర్యంలో నిర్వహించే మహిళల సంప్రదాయ సీమంతం వేడుకకు హాజరు కానున్నారు.

అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న ఆమె.. మణుగూరులోని భారీ వాటర్ ప్లాంట్ ను పరిశీలించనున్నారు. ఏమైనా.. సీఎం కేసీఆర్ విసిరే సవాళ్లను ఎదుర్కొని మరీ.. తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేసేందుకు గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రజలకు దూరంగా అక్కడెక్కడో రిమోట్ లో ఉంటే.. అందుకు భిన్నంగా గవర్నర్ మాత్రం చురుగ్గా పర్యటనలు చేస్తుండటం గమనార్హం.
Tags:    

Similar News