ఆ ప్రాజెక్టులకు ఇచ్చిన భూములు వెనక్కి..ఏపీ సర్కార్ షాక్

Update: 2019-10-20 06:21 GMT
అమరావతిలో రెండు ప్రాజెక్టులు చేపట్టేందుకు.. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకొని.. భారీగా భూమిని తీసుకున్నప్పటికీ.. ఎలాంటి పనులు చేపట్టని రెండు కంపెనీలకు భారీ షాకిచ్చింది ఏపీ సర్కారు. గత ప్రభుత్వం అమరావతిలో రెండు ప్రముఖ సంస్థలకు జరిపిన భూకేటాయింపుల్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయటమే కాదు.. ఇప్పటివరకూ వారు చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన వైనం సంచలనంగా మారింది. అయితే.. తాను ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోలేదని.. తామీ నిర్ణయాన్ని తీసుకోవటం వెనుక సహేతుకమైన కారణాలు ఉన్నట్లుగా పేర్కొంది.

గత ప్రభుత్వ హయాంలో ఇండో.. యూకే ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సంస్థ.. బీఆర్ షెట్టి మెడిసిటీ ప్రాజెక్టుల కోసం చంద్రబాబు సర్కారు భారీ ఎత్తున భూముల్ని కేటాయించింది. అయితే.. ఒప్పందంలో భాగంగా ఇప్పటివరకూ ఎలాంటి పనులు ప్రారంభించింది లేదు. ఈ నేపథ్యంలో హామీ ఇచ్చిన మేరకు పనులు చేయకపోవటాన్ని ప్రశ్నించటమే కాదు.. దానికి వివరణ ఇవ్వాలని కోరినా పట్టించుకోకుండా ఉన్న నేపథ్యంలో సర్కారు సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.

ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగింపు పైన చర్చ సాగుతున్న సమయంలోనే ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో రెండు ప్రముఖ సంస్థలకు జరిగిన భూ కేటాయింపులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భూ కేటాయింపుల సమయంలో చేసుకున్న నిబంధనలు అమలు చేయకపోవటం..ప్రభుత్వం నుండి నోటీసులు ఇచ్చినా స్పందించకపోవటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా పేర్కొంది. అంతేకాదు.. వారు చెల్లించిన రూ.75 కోట్లు తిరిగి ఇచ్చేది లేదని స్పష్టం చేసింది.

అయితే.. సదరు సంస్థలు ప్రభుత్వానికి తాము చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని కోరాయి. అయితే.. ఒప్పందంలో భాగంగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. అమరావతిలో మెడిసిటీ ప్రాజెక్టు ఏర్పాటుకు రూ.6500 కోట్లతో బీఆర్ షెట్టి సంస్థ ముందుకు వచ్చింది. దీంతో 2016 డిసెంబరులో అప్పటి ప్రభుత్వం  ఆ సంస్థకు వంద ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం శంకుస్థాపన జరిగింది. బోరు తప్పించి.. మరెలాంటి పని ప్రారంభం కాలేదు.

అదే రీతిలో ఇండో-యూకే ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సంస్థ..లండన్ కు చెందిన కింగ్స్ కాలేజీ ఆసుపత్రి కలిసి మెడిసిటీ ప్రాజెక్టు కోసం వెయ్యి కోట్ల రూపాయిల పెట్టుబడులు పెడతామని ముందుకొచ్చింది. దీంతో.. అప్పటి ప్రభుత్వం భారీగా భూమిని కేటాయించింది. ఇందులోభాగంగా తొలి విడతలో 50 ఎకరాల్ని కేటాయించింది. మరో వంద ఎకరాలు ఇచ్చేందుకు సంసిద్ధతను తెలియజేసింది. అయితే.. ఇప్పటివరకూ ఆ సంస్థ కనీసం ఇటుక కూడా వేయకపోవటం గమనార్హం.

ఇలా.. పలు ప్రాజెక్టుల పేరుతో పలు సంస్థలకు గత ప్రభుత్వం పెద్ద ఎత్తున భూముల్ని కేటాయించింది. అయితే.. వారెలాంటి పనులు స్టార్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలో భూకేటాయింపులు.. వారు చేసుకున్న ఒప్పందాలు.. చేసిన పనుల మీద సమీక్ష చేయాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది. రానున్న రోజుల్లో మరిన్ని సంచలన నిర్ణయాలు ఉండొచ్చన్న మాట వినిపిస్తోంది. భారీ ఎత్తున భూములు ప్రభుత్వం వద్ద తీసుకున్నప్పడు.. ఇచ్చిన మాట ప్రకారం పెట్టుబడులు పెట్టాలి కదా?  అలా కాకుండా ఉత్తనే ఉండిపోవటం వెనుక మర్మం ఏమిటన్నది ప్రశ్న. అందుకే.. గత ప్రభుత్వం జరిపిన భూకేటాయింపులపై రివ్యూ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.



Tags:    

Similar News