అబ్బే...బాబు ఆ ప‌నిచేయ‌లేదు

Update: 2016-12-22 06:29 GMT
రూ.500 - రూ.1000 నోట్ల రద్దును వ్యతిరేకించినట్లు మీడియాలో వచ్చిన వార్తలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోసిపుచ్చారు. అమలులో లోటుపాట్లను ప్రస్తావించానే తప్ప, నోట్ల రద్దుకు వ్యతిరేకంగా తాను వ్యాఖ్యలు చేయలేదని వివ‌ర‌ణ ఇచ్చారు. ఈ మేరకు సీఎం పేరిట సమాచారశాఖ  ప్రకటన విడుదల చేసింది. నగదు సమస్యతో అనుకున్న స్థాయిలో బ్యాంకుల్లో నగదు అందుబాటులో ఉండడం లేదని, త‌ద్వారా గ్రామాల్లో పింఛనుదారులు - రైతులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని సీఎం అన్నట్లు ఆ ప్ర‌క‌ట‌న తెలిపింది.

 కొన్ని అవాంఛనీయ సంఘటనలను చూస్తే మనసు చలించిపోతోందని చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం చేశార‌ని ఈ ప్ర‌క‌టన‌ వివ‌రించింది.  పింఛన్లు ఇస్తున్నట్టు గర్వంగా చెప్పుకుని, అక్టోబర్‌ 2నుంచి అమల్లో పెట్టానని, నిధులు ఉన్నా నగదును పింఛనుదారులకు నేరుగా అందించలేక పోయాననే ఆవేదన కలుగుతోందని బాబు చెప్ప‌గా...దీన్ని వక్రీకరించార‌ని  ఈ లేఖ‌లో వివ‌రించారు. ఇంత సంక్షోభాన్ని తానెన్నడూ ఎదుర్కోలేదని చంద్ర‌బాబు వ్యాఖ్యానించినట్లు అధికారిక స‌మాచారం వెల్ల‌డించారు. ఆర్‌ బిఐ-బ్యాంకర్లు మానవీయ కోణంతో అలోచించి ప్రజల ఇబ్బందులను దూరం చేయడం పైనే దష్టి పెట్టాలని సూచించినట్లు వివరించారు. వచ్చే నగదును ఎక్కువ మొత్తంలో గ్రామాల్లోనే అందుబాటులో ఉంచాలని, వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్న ప్రస్తుత తరుణంలో రైతులకు నగదు అందుబాటులోకి రావాలని చంద్ర‌బాబు ఆకాంక్షించార‌ని అధికార ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News